బెంగళూరును ముంచెత్తిన వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ

బెంగళూరును ముంచెత్తిన వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ

బెంగళూరు నగరాన్ని  భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షం నగరాన్ని తడిపేసింది. దీంతో బెల్లందూరు ఐటీ జోన్ తో సహా నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు వర్షం ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 

బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి.. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అపార్ట్ మెంట్ సెల్లార్లలోకి నీరు చేరి వాహనాలు పాడైపోయాయి. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ స్విమ్మింగ్ ఫూల్స్ లా మారాయి. ఓపెన్ మ్యాన్‌హోల్స్‌లోకి నీరు ప్రవహించడం వాహనదారులకు భయాందోళన కలిగించింది. గత నెలలో,  వరుసగా మూడు రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షం కురింది. దీంతో సిలికాన్ సిటీ జలమయంగా మారింది. ఆ సమయంలో వరదల ధాటికి రెండు రోజుల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. గ్లోబల్ ఐటి కంపెనీలు, స్వదేశీ స్టార్ట్-అప్‌లు ఉన్న నగరంలోని కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. సమీపంలోని నివాస ప్రాంతాలలో, రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. కొన్ని నాగరిక హౌసింగ్ కాలనీలలోని నిర్వాసితులను రక్షించడానికి ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతకు ముందు 2017లో బెంగళూరు నగరంలో 1,696 మి.మీ వర్షం కురిసింది.

కూలిన మైసూర్ ప్యాలెస్ గోడ

మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన మైసూర్ ప్యాలెస్ ప్రహరీ గోడ కొంతభాగం కూలిపోయింది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కనీస పర్యవేక్షణ చేయలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే కోట గోడ కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. శత్రువుల నుంచి రక్షణ కోసం మారెమ్మ ఆలయం, జయమార్తాండ ప్రధాన ద్వారాల మధ్య మైసూరు మహారాజు ఈ గోడను నిర్మించారు. వందల సంవత్సరాల క్రితం కట్టిన మైసూరు ప్యాలెస్ చూడడానికి.. ప్రతి ఏటా వందల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. 

నిపుణుల పరిశీలన 

ప్యాలెస్ ప్రహరీ కూలిన ప్రాంతాన్ని నిపుణులతో కలిసి పురావస్తుశాఖ అధికారులు పరిశీలించారు. గోడలకు అక్కడక్కడా ఏర్పడిన పగుళ్లను పరిశీలించిన అధికారులు.. మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.