
హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. దుమ్మురేపుతోంది. అలా ఇలా కాదు.. కుండపోత వర్షంతో బీభత్సం చేస్తోంది. భారీ వర్షంతో 5 నిమిషాల్లోనే రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. 2025, ఆగస్ట్ 7వ తేదీ సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు స్టార్ట్ అయిన వర్షం సిటీని అల్లకల్లోలం చేసింది.
హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, నాగోలు, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్ పూర్ మెట్ ఏరియాల్లో భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు పారుతున్నాయి.
ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పటం లేదు వాహనదారులకు.
పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, ఐకియా ఏరియాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది.
దిల్ షుఖ్ నగర్, మలక్ పేట్, అత్తాపూర్, కొత్తపేట, చంపాపేట ఏరియాల్లో వర్షం భారీగా పడుతుంది.
సాయంత్రం మొదలైన వర్షం అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాలోనూ భారీ వర్షంతో.. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చాయి. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, కాంచన్ బాగ్, షాలిబండ, ఛత్రినాక, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఏరియాల్లోనూ వర్షం భారీగా పడుతుండటంతో.. రోడ్లపై నీళ్లు ఉండటంతో.. వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన ఆగిపోయారు.
ఛత్రినాక ప్రాంతం లోని రాజన్న బావి, శివాజీ నగర్, శివగంగా నగర్, ఛత్రినాక తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తున్నాయి.
ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, హబ్సిగూడ, రామంతాపూర్, తార్నాక, ఓయూ, నాచారం ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తోంది.