హైదరాబాద్ లో 2 గంటలు 15 సెం.మీ..ఈ సీజన్​లో ఇదే అతిపెద్ద వాన

హైదరాబాద్ లో 2 గంటలు 15 సెం.మీ..ఈ సీజన్​లో ఇదే అతిపెద్ద వాన
  • లోతట్టు ప్రాంతాలు మునక.. తీవ్ర అవస్థలు పడ్డ ప్రజలు
  • రాష్ట్రంలో వారం పాటు వర్షాలు

శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్  ఆగమాగమైంది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువులలెక్క తయారయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాలా గోడలు కూలిపోయి, నాలాలు ఉప్పొంగి వరద నీటితోపాటు మురుగు నీళ్లు ఇండ్లల్లోకి  వచ్చి చేరాయి. పలుచోట్ల కరెంటు కట్​ అయింది. ఉద్యోగులు డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరే టైం కావడం.. ఆపై వాన దంచికొట్టడంతో భారీగా ట్రాఫిక్​ జామైంది. సెక్రటేరియట్, ఖైరతాబాద్​, అసెంబ్లీ, అమీర్​పేట్, బేగంపేట్​ వంటి ఏరియాల్లో గంటల తరబడి రోడ్లమీద వాహనాలు నిలిచి పోయాయి. సాయంత్రం 5  గంటలకు మొదలైన కుండపోత వాన రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు కూడా పడింది. ఈ సీజన్​లో ఇదే అతిపెద్ద వాన. అత్యధికంగా ఆసిఫ్​నగర్​లో 15.1 సెం. మీ, షేక్​పేట్​లో 12.7 సెం.మీ, ఖైరతాబాద్​లో 12.3 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.

హైదరాబాద్, వెలుగుభారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాలు లోతు నీటిలో ఎక్కడికక్కడే  ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ ల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో వాహనదారులు తీవ్రమైన  ఇబ్బందులు పడ్డారు. సిటీలో ప్రధాన రహదారులన్ని వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయి వాటర్ లాగింగ్​ పాయింట్స్ ని క్లియర్ చేశారు. ఇందులో ప్రధానంగా కూకట్​పల్లి నుంచి ఎల్బీనగర్ వెళ్లే రూట్ లో 11 ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరుకుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో కరెంట్ కు అంతరాయం కలిగింది. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం రెండు గంటల పాటు భీకరంగా కురిసింది. రాత్రి 9 గంటల వరకు కూడా పలు చోట్ల వర్షం పడింది. ఈ వర్షాకాలంలో ఇదే అతిపెద్ద వానగా వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా ఆసీఫ్ నగర్ లో 15.1 సెంటీమీటర్లు, షేక్ పేట్‌‌లో 12.7 సెం.మీ., గండిపేట్ లో 12.58 సెం.మీ., ఖైరతాబాద్ లో 12.3 సెం.మీ. నమోదైంది. అత్యల్పంగా ముషీరాబాద్ లో 6.35 సెం.మీ., హిమాయత్ నగర్ (కవాడిగూడ డంపింగ్ యార్డ్) లో 6.15, ముషీరాబాద్ (ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ఆఫీస్) 5.83, హిమాయత్ నగర్ (నారాయణగూడ) 5.83, చిలకలగూడ లో 5.83 సెంటీమీటర్లుగా నమోదైంది.

చింతల్​బస్తీలో కూలిన నాలా గోడ

ఖైరతాబాద్​లోని చింతల్​ బస్తీలో నాలా గోడ కూలింది. చింతలబస్తీ నుంచి ఆనంద్‌‌నగర్‌‌ పోయే మార్గంలో సాయిబాబా కమాన్‌‌ దగ్గర ఉన్న ఈ గోడ కూలడంతో 4 ఫీట్లకు పైగా నీరు రోడ్డు మీదికి వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మారుతీనగర్‌‌లోని నాలాలోకి నీళ్లు వెళ్లక ఇండ్లలోకి వచ్చి చేరాయి. బీజేఆర్‌‌ నగర్‌‌లో ఇల్లు కూలింది.

కాల్ సెంటర్ కు ఫిర్యాదుల వెల్లువ

భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ కు  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వాటర్‌‌ లాగింగ్‌‌పై ఎక్కువగా కాల్స్‌‌  రికార్డయ్యాయి. గ్రేటర్‌‌ కాల్ సెంబర్ కు  27 ఫిర్యాదులు,  డయల్‌‌ 100కు  29 కంప్లయింట్స్‌‌, మై జీహెచ్ఎంసీ యాప్ లో 12 ఫిర్యాదులు నమోదయ్యాయి. డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యతో కాల్ సెంటర్ కు  94,  మై జీహెచ్ఎంసీ యాప్ లో 67, జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో 4 కంప్లెయింట్స్ నమోదయ్యాయి. వర్షం కురిసిన మొదటి గంటలోనే సిటీ వ్యాప్తంగా మూడు వందల ఫిర్యాదులు వచ్చాయి.

రోడ్లపై నిలిచిన నీరు, ట్రాఫిక్ జామ్

బేగంపేట్, పంజాగుట్ట, టోలిచౌకి, సైఫాబాద్, నారాయణగూడ, ఆబిడ్స్,  సికింద్రాబాద్,  గోషామహల్, కాచిగూడ, నాంపల్లి, అసెంబ్లీ, బషీర్ బాగ్  తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.  సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్​భవన్​, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మైత్రివనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్  వంటి రూట్లలో భారీగా  ట్రాఫిక్ జామైంది. లేక్‌‌వ్యూ గెస్ట్‌‌ హౌజ్‌‌, లక్డీకాపూల్‌‌, అమీర్‌‌పేట మైత్రీవనం, కేసీపీ చౌరస్తాలు చెరువులను తలపించాయి. అంబర్ పేట్ అలీ కేఫ్ వద్ద భారీవానకు మూసారాంబాగ్ బ్రిడ్జీపైకి మూసీనది వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండి వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో జనం ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు సరఫరాపై ఎస్పీడీసీఎల్​ సీఎండీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. సిటీలో ట్రాఫిక్‌‌ను సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు.

మరో వారం పాటు వర్షాలు

రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు,  ఒకటీరెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే చాన్స్​ ఉందని పేర్కొంది.