హైదరాబాద్లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీకి వెల్లువెత్తిన ఫిర్యాదులు

హైదరాబాద్లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీకి వెల్లువెత్తిన ఫిర్యాదులు

హైదరాబాద్లో కుంభపోత వర్షం కురిసింది. గంటల వ్యవధిలోనే భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. అయితే మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. నేరేడ్ మెట్ లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క గంటలోనే దాదాపు 129 కంప్లైంట్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

బేగంపేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , సికింద్రాబాద్, సనత్ నగర్ ,అమీర్పేట్, కొత్తపేట్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంపాపేట్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగం బజార్ తరిత ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. ఓయూ, మల్కాజ్ గిరి, నేరేడ్ మెట్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కారణంగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో జనం తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో బయట అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపైకి సైతం భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడ  జాతీయ రహదారిపై భారీగా చేరిన వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో రెండు మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.  

నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు

నేరేడ్మెట్ 9.5 సెంటీ మీటర్లు
ఆనంద్ బాగ్ 7.3 సెంటీ మీటర్లు
తిరుమలగిరి 6.3 సెంటీ మీటర్లు..
హయత్ నగర్ 6.2 సెంటీ మీటర్లు
ఏఎస్ రావు నగర్ 6 సెంటీ మీటర్లు
ఫతేనగర్ 5.4 సెంటీ మీటర్లు
బేగంపేట్ 5 సెంటీ మీటర్లు..
అల్వాల్ 4.8 సెంటీ మీటర్లు
మౌలాలి, ఎల్బీ నగర్ 4.5 సెంటీ మీటర్లు
వనస్థలిపురం, బాలానగర్ 4 సెంటీ మీటర్లు
మెట్టుగూడ, యూసుఫ్గూడ 3.6 సెంటీ మీటర్లు
సరూర్ నగర్, బన్సీలాల్ పేట్ 3.2 సెంటీ మీటర్లు
కుత్బుల్లాపూర్ 3 సెంటీ మీటర్లు
నాగోల్, హస్తినపురం 2.8 సెంటీ మీటర్లు
రాజేంద్రనగర్ 2.5 సెంటీ మీటర్లు
లింగోజిగూడ, చంద్రాయణగుట్ట 1.7 సెంటీ మీటర్లు