తిరుపతిలో గాలి వాన బీభత్సం : చెట్లు కూలి వాహనాలు ధ్వంసం

తిరుపతిలో గాలి వాన బీభత్సం : చెట్లు కూలి వాహనాలు ధ్వంసం

ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మారిన వాతావరణంతో నగరవాసులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఈదురుగాలుల బీభత్సానికి తిరుపతిలోని చర్చ్ రోడ్డులో భారీ చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ఆటోపై భారీ చెట్టు కొమ్మ విరిగిపడటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆటో సగానికి పైగా ధ్వంసమైపోయింది.

చెట్టు కొమ్మ పడిన సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్‌తో పాటు ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

భారీ గాలుల ధాటికి నగరంలో పలుచోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు, భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మున్సిపల్, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై పడ్డ చెట్లను తొలగించే పనులను ముమ్మరం చేశారు.