మరో మూడు రోజులు వర్షాలు

మరో మూడు రోజులు వర్షాలు
  • వందల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు బంద్
  • గోదావరి, కృష్ణా నదులకు భారీగా పెరిగిన వరద
  • ప్రధాన ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్
  • మెదక్ జిల్లాలో వాగులో చిక్కుకున్న గొర్ల కాపర్లు

నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వానలు, వరదలకు ఆదివారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. వాగులపై వంతెనలు లేని పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకపోతుండగా స్థానికులు కాపాడారు. రోడ్లు తెగిపోవడం, వాగులు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండటంతో వందల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతుండడంతో ఎస్సారెస్సీ, ఎల్లంపల్లి, కాళేశ్వరం, శ్రీశైలం, సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ సిటీల్లో వరద నీరు వెళ్లే మార్గంలేక పలు కాలనీలు నీటమునిగాయి.

నేషనల్​ హైవే తెగింది
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్ పల్లి వాగు పొంగి చెన్నూరు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూరు సమీపంలోని బతుకమ్మ వాగు దగ్గర నేషనల్ హైవే 63 తెగిపోవడంతో రవాణా స్తంభించింది. ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణి మండలం కోయ తెలండి, ఎదల్పాడ్, మాణిక్యపూర్, పంగిడి మదర (భూగ్గా) వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలండి గ్రామంలో ఇండ్లలోకి నీళ్లు చేరడంతోపాటు సుమారు 3 వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. తిర్యాణి మండలంలో అత్యధికంగా 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్​ జిల్లా అల్లాదుర్గంలో 18.4 సెంటీమీటర్ల వాన కురిసింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగు పొంగడంతో సిద్దిపేట –హనుమకొండ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నర్సంపల్లి నుంచి రాంపూర్ వెళ్లే రోడ్డు వరద నీటికి తెగి రాకపోకలు నిలిచిపోయాయి. 

కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. గంగాధర మండలం ఇస్తారిపల్లె–- నారాయణపూర్‌‌‌‌కు రాకపోకలు బంద్ అయ్యాయి. గన్నేరువరం, పారునెల్ల చెరువు లెవెల్​కల్వర్టు వద్ద వరద ఉధృతి పెరగడంతో మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లాలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ​నుంచి కొత్తచెరువు వరకు రోడ్డు నీటమునగడంతో కామారెడ్డి, కరీంనగర్‌‌‌‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 504.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని జల్లేరు, కిన్నెరసాని, ఏడు మెలికల, చింతలపడి, మల్లన్న వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్​నగరంలోని శివనగర్, సాయిగణేశ్​ కాలనీ, ఎస్ఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ ఏరియాల్లోకి నీళ్లు చేరాయి. నిజామాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు 84.6  మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 92 ప్రాంతాల్లో  రాకపోకలు నిలిపివేశారు.

ప్రాజెక్టులు కళకళ
నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ‌‌భారీ ఇన్ ఫ్లో వస్తుండడంతో ఆదివారం‌‌ ఉదయం 27 గేట్లు ఓపెన్ చేసి 1,24,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం వరద ఉధృతి మరింత పెరగడంతో 30 గేట్లు ఎత్తి 1,99,928 క్యూసెక్కులు వదిలారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090 అడుగులుగా ఉంది. 89 టీఎంసీల నీటితో ప్రాజెక్ట్‌‌ నిండుకుండలా మారింది. నిర్మల్​ జిల్లా కడెం ప్రాజెక్టులోకి ఆదివారం 63,200 క్యూసెక్కుల వరద నీరు రావడంతో.. 11 గేట్లు ఎత్తి 1,47,000 క్యూసెక్కులను దిగువకు వదిలారు. పూర్తి కెపాసిటీ 700 అడుగులు కాగా, ప్రస్తుతం 693.95 అడుగులకు చేరుకుంది. కరీంనగర్‌‌‌‌లోని ఎల్ఎండీలోకి మోయతుమ్మెద వాగు నుంచి, మిడ్ మానేరు నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో దిగువకు 14 గేట్లు ఎత్తి 93 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 4.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పార్వతి బ్యారేజ్ నుంచి 60 గేట్లు ఎత్తి 3.50 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజ్ నుంచి మొత్తం 66 గేట్లు ఎత్తి 3.05 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తున్నట్టు తెలిసింది. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.81 లక్షల క్యుసెక్కుల వరద ఉండగా 65 గేట్లను తెరిచి నీటిని రిలీజ్‌‌‌‌ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్‌‌‌‌కు ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో ఆరు గేట్ల ద్వారా 2,652 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయాత్ సాగర్‌‌‌‌కు ఇన్ ఫ్లో 600 క్యూసెక్కులు వస్తుండగా.. 678 క్యూసెక్కలను కిందికి వదులుతున్నారు.

వరదలో కారు గల్లంతు.. అమ్మమ్మ, మనుమడు మృతి
జగిత్యాల జిల్లా చల్ గల్ గ్రామానికి చెందిన బుర్ర శ్రీనివాస్– గంగ దంపతులకు వంశీ, మహేశ్​ కొడుకులు, శిరీష కూతురు. బిడ్డకు పెండ్లి కాగా, ఇద్దరు కొడుకులు గల్ఫ్‌‌లో ఉంటున్నారు. శ్రీనివాస్ దంపతులు చల్ గల్‌‌లో హోటల్ పెట్టుకుని బతుకుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శిరీష తన కొడుకు కన్నయ్యతో పాటు వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నది. మూడు నెలల క్రితం హైదరాబాద్‌‌లో జాబ్ రావడంతో కొడుకును తల్లిదండ్రుల దగ్గర ఉంచి వెళ్లింది. కన్నయ్యకు తల్లి మీద బెంగతో జ్వరం వచ్చింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున గంగ తన మనుమడిని తీసుకుని కారులో హైదరాబాద్ ప్రయాణమైంది. వర్షాలతో వేములవాడ రూరల్ మండలం ఫాజుల్​నగర్ కల్వర్టు మునిగిపోగా.. దాన్ని దాటే క్రమంలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో గంగ (47), మనుమడు కన్నయ్య (2) చనిపోయారు. నరేశ్‌‌ అనే మరో వ్యక్తి, డ్రైవర్ రిజ్వాన్​ను కాపాడారు.

కారుపై చెట్టు పడి ఇద్దరు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన 13 మంది యువకులు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల వాటర్​ ఫాల్స్​ చూసేందుకు కారులో బయలుదేరారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్ పూర్ వద్ద ఓ భారీ వృక్షం వీరి వాహనంపై పడింది. దీంతో డ్రైవర్ బుచ్చి రాజం (45), వి.రవి (35) చనిపోయారు. నిఖిల్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని సీఐ గొర్ల అజయ్ బాబు తెలిపారు. రవి మూడు నెలల కిందట దుబాయ్ ​నుంచి వచ్చాడు. ఈనెల 20న తిరిగి వెళ్లాల్సి ఉండగా.. ఈలోపే ప్రమాదం జరిగింది.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గుండారపు ప్రశాంత్​(24), సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సూరంపల్లికి చెందిన ముత్యాల గౌతమ్ అలియాస్ గౌతమబుద్ధుడు​(23)​ స్నేహితులు. హైదరాబాద్‌‌లో ప్రశాంత్ పీజీ చేస్తూనే గవర్నమెంట్​జాబ్స్​కు ప్రిపేర్​అవుతుండగా.. గౌతమ్​మెడికల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. పది రోజుల కింద ప్రశాంత్​మరో ఫ్రెండ్ వనం రాకేశ్.. వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతంలో చనిపోయాడు. శనివారం రాకేశ్ దశ దిన కర్మ ఉండటంతో ప్రశాంత్, గౌతమ్ వచ్చారు. కార్యక్రమం తర్వాత కాజీపేట నుంచి ట్రైన్‌‌లో వెళ్లాలనుకున్నారు. అప్పటికే వర్షం పడుతుండటం, ట్రైన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రశాంత్ బంధువులు ఉండే ఊరుగొండకు వెళ్లాలనుకున్నారు. వనం రాకేశ్​ సోదరుడైన కార్తీక్‌‌ బైక్ తీసుకుని రాత్రి 8:30 గంటల ప్రాంతంలో వరంగల్​నుంచి ఊరుగొండ వెళ్తుండగా, మద్దెలకుంట ఏరియాలో నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడాదిన్నర కిందటే పనులు స్టార్ట్ అయినా ఫండ్స్ లేని కారణంగా సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఆపివేశాడు. దీంతో వాహనదారులు పక్క నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అసంపూర్తిగా వదిలేసిన కల్వర్టు వద్ద డైవర్షన్​ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, వర్షానికి రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ప్రమాదం జరిగినా ఆదివారం ఉదయం వరకు విషయం బయటికి రాలేదు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు ఇంతేజార్ గంజ్​సీఐ మల్లేశ్.. కాంట్రాక్టర్​రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరో మూడు రోజులు వర్షాలు
రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదివారం అత్యధికంగా నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌‌చాందాలో 12.6 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు.

జలదిగ్బంధంలో పట్టణాలు, పల్లెలు
మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో చేపలు పట్టేందుకు వెళ్లిన మెదక్‌‌లోని జంబికుంటకు చెందిన పిల్లలు అల్తాఫ్, అఫ్రీన్ పోచారం ప్రాజెక్ట్ వరద పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. మెదక్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అమర్ నాథ్ గౌడ్, సిబ్బంది 40 నిమిషాలు కష్టపడి తాళ్లు, లైఫ్ జాకెట్ల సాయంతో వారిని రక్షించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో మంజీరా నది పాయల మధ్యలో బొడ్డెమీద గొర్రెలు మేపుతున్న నారాయణపేట జిల్లా మర్కల్ గ్రామానికి చెందిన ఆరుగురు గొర్ల కాపరులు కిష్టాపూర్ మల్లేశం, దండు చిన్నప్ప, మిడిగిరి మల్లప్ప, చెర్లపల్లి నర్సింలు, మిడిగిరి అనిల్, దండు హన్మంత్ చిక్కుకుపోయారు. వెయ్యికి పైగా గొర్లు ఉన్నాయి. అక్కడ ఉండేందుకు అనుకూలంగా ఉండడం, వండుకునేందుకు సరుకులు ఉండడంతో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులు చెప్పారు. మంజీరా నది ఉధృతితో వనదుర్గా ప్రాజెక్ట్ పొంగి పొర్లుతున్నది. దీంతో ఏడుపాయల వన దుర్గా దేవి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఏదుల పాడ్ శివార్లలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన గొర్ల మందపై పిడుగు పడడంతో 152 గొర్లు చనిపోయాయి. రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. కరీంనగర్​జిల్లా సైదాపూర్‌‌‌‌లో వరదనీటిలో ఓ వ్యక్తి బైక్‌‌తో సహా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. సైదాపూర్ మండలంలో హుజూరాబాద్--–హుస్నాబాద్ మార్గంలో బైక్‌‌పై వెళ్తున్న ఒకరు కిందపడగా.. అక్కడున్న వారు రక్షించారు.  సిరిసిల్ల జిల్లా వేములవాడలోని చెక్కపల్లి రోడ్డులోని సబ్​స్టేషన్ లోకి వరద చేరడంతో పట్టణంలో 12 గంటలు కరెంట్​సప్లై నిలిచిపోయింది. మర్రిపల్లిలోని కల్వర్టు వద్ద బైక్​తోపాటు వరదలో పడిపోయిన యువకుడిని స్థానికులు కాపాడారు. కోనరావుపేట మండలం మరిమడ్ల సర్పంచ్ అశోక్ ఇంట్లో పిడుగు పడడంతో గోడలు, ఫర్నిచర్​ ధ్వంసమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కొంగోని వాగులో కొత్తగూడేనికి చెందిన ముగ్గురు వ్యక్తులు కాటారం వైపు వస్తుండగా కారు చిక్కుకున్నది. వారిని స్థానికులు కాపాడారు.