జోరు వానలు..జనం అవస్థలు..

జోరు వానలు..జనం అవస్థలు..

రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదు అవుతోంది. వాగులు, వంకలు.. పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోతున్నాయి. 24గంటల్లో మెదక్ జిల్లా పాతూర్ లో అత్యధికంగా 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా దేవరుప్పలలో 25.5, మెదక్ రాజపల్లిలో 22.3, మహబూబాబాద్ దంతాలపల్లిలో 22.2, సంగారెడ్డి జిన్నారంలో 21.3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 20, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల వాగులు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండడంతో స్కూళ్ల నుంచి తిరిగొచ్చే టైంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. నర్సింహులపేట మండల కేంద్రంలో ఎంపీడీవో, ఐకేపీ, సహా హాస్టల్ భవనాలు నీట మునిగాయి. కొమ్ములవంచ కొత్తచెరువు అలుగులో చిక్కుకున్న స్కూల్ బస్సులోని విద్యార్ధి సురక్షితంగా రక్షించారు స్థానికులు. అటు నెల్లికుదురు మండలం కేంద్రంలో భారీ వర్షం పడింది. రావిరాల దగ్గర లోలెవల్ వంతెనపై వరద ప్రహిస్తోంది. హనుమకొండ-భూపాలపట్నం 163 నేషనల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. పస్రా- తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై భారీగా వరద నీరు వస్తోంది. 

అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో.. వాగులు వంకలు పొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నార్లపూర్ చెక్ పోస్టు దగ్గర  రహాదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

వరంగల్ జిల్లా మండీ బజార్ లో ప్రమాదం జరిగింది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో పాత ఇంటి గోడ కూలింది. స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సమ్మక్కను ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని పైడి, ఫిరోజ్ లుగా పోలీసులు గుర్తించారు. 

జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లింగాల ఘనపూర్ మండలంలోని చీటూరు వాగు ఒక్కసారిగా పొంగడంతో.. 14మంది మహిళా కూలీలు చిక్కుకుపోయారు. వరి నాట్లు వేసేందుకు వెళ్లిన కూలీలు.. వాగు పొంగడంతో స్మశాన వాటికలో తలదాచుకున్నారు. NDRF టీమ్స్ వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కొత్తగూడెం, గుండాల, పాల్వంచ, బూర్గంపహాడ్, ఆళ్లపల్లి, ముల్కపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముల్కలపల్లి మండలం అన్నారం చప్టా దగ్గర వాగులో కొట్టుకుపోతున్న మహిళను పంచాయతీ సిబ్బంది కాపాడారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, మోటకొండూర్, తుర్కపల్లి మండలాల్లో కుండపోత వర్షం పడింది. యాదగిరిగుట్టలోని రోడ్లు, ఆలయ ఘాట్ రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు ఎంట్రీ దగ్గర భారీగా వరదనీరుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు జి.కొత్తపల్లి ముకుందాపురం గ్రామాల మధ్యనున్న పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో 23మంది కూలీలు వాగుకు అవతల వైపు చిక్కుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా చౌళ్లతండాకు చెందిన కూలీలను రెస్క్యూ చేసి రక్షించారు. సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు.  

మరోవైపు ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్తాయని ప్రకటించింది.  హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, రంగారెడ్డిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు . ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.