దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

గాంధీనగర్: గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డాంగ్, నవసారి, తాపీ, వల్సాద్, పంచమహల్, ఛోటా ఉదేపూర్, ఖేడా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వదరలు వచ్చి భవనాలు నీట మునిగాయి. వడోదర డివిజన్ పరిధిలో రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో 10 రైళ్లను రద్దు చేశారు. రాష్ట్రంలో మరో ఐదు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, వరదల వల్ల గడిచిన 24 గంటల్లో ఏడుగురు చనిపోయారని మంత్రి రాజేంద్ర త్రివేది మంగళవారం తెలిపారు. పిడుగులు పడి కొందరు.. వరదల్లో కొట్టుకుపోయి, గోడలు కూలి మరికొందరు మరణించారని చెప్పారు. వర్షాల వల్ల జూన్ 1 నుంచి ఇప్పటి వరకు చనిపోయినోళ్ల సంఖ్య 63కు చేరిందని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న 468 మందిని రక్షించామని, 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కాగా, సీఎం భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. వల్సాద్ జిల్లాలో అంబికా నదిలో చిక్కుకున్న 16 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ఎయిర్ లిఫ్ట్ చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా తెలిపారు. 

మహారాష్ట్రలో ముగ్గురు మృతి.. 
మహారాష్ట్రలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా గడిచిన 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. ముంబైలో గోడ కూలి ఇద్దరు చనిపోగా, గడ్చిరోలి జిల్లాలో ఒక్కరు వరదలో కొట్టుకుపోయారు. మంగళవారం నాసిక్ లో  9, ముంబైలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాసిక్ లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. నార్త్ మహారాష్ట్రలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఢిల్లీ, రాజస్థాన్ లోనూ..
రాజస్థాన్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మౌంట్ అబూలో 8, ప్రతాప్ గఢ్ లో 8, సంగోడ్ లో 7సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో బన్స్వారా, సిరోహి, ఝాల్వార్, చిత్తోర్ గఢ్, బర్మేర్, జైసల్మేర్, జోధ్ పూర్, నాగౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఢిల్లీలో మంగళవారం మోస్తరు వానలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ముంచెత్తడంతో ట్రాఫిక్ జామ్ అయింది.