దేశంలో దంచి కొడ్తున్న వానలు

దేశంలో దంచి కొడ్తున్న వానలు

ముంబై/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, గోవా, తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజుల పాటు ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, గోవా, కర్నాటక,  ఒడిశాలో భారీ వర్షాలు పడొచ్చని ఇండియా మెటిరియోలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ) అంచనా వేసింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు వర్షాలతో 76 మంది చనిపోయారని ఆదివారం అధికారులు వెల్లడించారు. శనివారం 3జిల్లాల్లోని 130 గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. ఈ ఒక్కరోజే 9 మంది మరణించారని చెప్పారు. జూన్ 1 నుంచి 125 జంతువులు కూడా చనిపోయాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైతో పాటు కొంకణ్ తీర ప్రాంతాల్లో 13 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ముంబైలో కూడా కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. సిటీకి ఐదు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్​ను జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. 

కేరళలో 12 జిల్లాలకు అలర్ట్ 

కేరళలోని వివిధ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని 4జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను, 8జిల్లాలకు యెల్లో అలర్ట్​ను జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లో వచ్చే 5రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.  
ఢిల్లీలో తక్కువ వానలు
దేశ రాజధాని ఢిల్లీలో పోయిన నెలలో రుతుపవనాలు ప్రవేశించినప్పుడు భారీ వర్షాలు పడ్డాయని, ఈ నెల ఫస్ట్ నుంచి మాత్రం వర్షపాతం తక్కువగా నే నమోదైందని సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీ వెల్లడించింది. ఢిల్లీలో పది రోజుల్లో 2.6 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపింది. 
కర్నాటకలో 

డేంజర్ లెవల్​కు నేత్రావతి  

కర్నాటకలోని నేత్రావతి నదిలో నీటి ప్రవాహం డేంజర్ లెవల్​కు చేరిందని అధికారులు ఆదివారం వెల్లడించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడి వద్ద నదీ ప్రవాహం శనివారం 6.8 మీటర్ల వద్ద ఉండగా, ఆదివారం అది 8.5 మీటర్లకు పెరిగినట్లు తెలిపారు. నేత్రావతి బేసిన్​లో లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే నీట మునిగాయన్నారు. 

గుజరాత్​లో భారీ వర్షాలు 

గుజరాత్​లోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆదివారం ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. నవ్ సారి, వల్సాద్ జిల్లాల్లోని కావేరి, అంబిక, ఓర్సాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ హెచ్చరించింది.