
ముంబై: ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం కూడా కుండపోత వానలు పడ్డాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు సౌత్ ముంబైలో 10.7 సెంటీమీటర్లు, తూర్పు శివారు ప్రాంతాల్లో 17.2, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. సియాన్, మాతుంగ, దాదర్, గాంధీ మార్కెట్, కుర్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడానికి కారుకు బదులు పడవ కావాలంటూ ఓ సిటిజన్ ట్వీట్ చేశారు. రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలవడంతో సర్వీసులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెప్పారు. కాగా, భారీ వర్షాలకు ముంబైలోని చునాభట్టి ఏరియాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడున్నోళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పల్గర్ జిల్లాలో వరద పోటెత్తి 12 గ్రామాలు నీట మునిగాయి. థానెలో ఈఎస్ఐ ఆస్పత్రిలో గోడ కూలి మహిళకు గాయాలయ్యాయి.
మరో రెండ్రోజులు భారీ వానలు..
మహారాష్ట్ర సహా గోవా, గుజరాత్ లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సౌత్ కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్రకు రెడ్ అలర్ట్, నార్త్ కొంకణ్ కు ఆరెంజ్ అలర్ట్, విదర్భకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.