ఓరుగల్లులోవానల జోరు..ములుగు జిల్లా వాజేడులో అత్యధికంగా 13.82 సె.మీ. వర్షపాతం నమోదు

ఓరుగల్లులోవానల జోరు..ములుగు జిల్లా వాజేడులో అత్యధికంగా 13.82 సె.మీ. వర్షపాతం నమోదు
  •     రూరల్ జిల్లాల్లో భారీ వర్షాలు
  •     బొగ్గు ఉత్పత్తికి అంతరాయం.. 
  •     వాగులు పొంగి రాకపోకలు బంద్.. 
  •     బొగతకు తాత్కాలికంగా నో ఎంట్రీ

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం నుంచి జోరుగా వాన కురిసింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు ప్రారంభమవగా.. సాయంత్రం నుంచి గ్రేటర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ వాన దంచికొట్టింది. బుధవారం రోజంతా ముసురుతో పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటివరకు నగర ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు కురవగా, తాజాగా రూరల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ములుగులో భారీ వర్షం.. రాకపోకలకు బంద్​

ములుగు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాజేడు మండలంలో అత్యధికంగా 13.82 సెంటీమీటర్లు, ఏటూరునాగారంలో 12.28 సెంటీమీటర్లు, వెంకటాపురంలో 8.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారి-163పై తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. కలెక్టర్ బోర్హడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రజలు వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

మంగపేట మండలం కొత్తూరు–బొమ్మాయిగూడెం మధ్య గౌరారం వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లిలో లోతట్టు ప్రాంత ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు. వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. దేవాదుల వద్ద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం బ్యారేజీ)కి 81,300 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో నమోదవగా, 9 గేట్ల ద్వారా 78,994 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

భూపాలపల్లిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం..

భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి కేటీకే-2, కేటీకే-3 ఓపెన్‌‌‌‌కాస్ట్ గనుల్లోకి వరదనీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. రోజుకు సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. గనుల్లోకి చేరిన నీటిని మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సుమారు 67,200 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో నమోదవుతుండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. మహాదేవపూర్, మహాముత్తారం మండలాల్లో భారీ వర్షాలు కురవడంతో చుండ్రుపల్లి, పెద్దవాగు, కోనంపేట వాగులు ఉప్పొంగాయి. లోలెవల్ వంతెనలపై నీరు చేరడంతో పలు అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మహబూబాబాద్ జిల్లాలోనూ జోరువాన..

మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. బయ్యారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో జోరుగా వర్షం కురిసింది. బయ్యారం పెద్దచెరువులోకి సుమారు 9 అడుగుల మేర వరదనీరు చేరింది. జిల్లాలో మొత్తం 420.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

‘వరంగల్’లో రాత్రంతా వాన.. ఉదయం ముసురు

గ్రేటర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు కొనసాగగా, సాయంత్రం వర్షం తగ్గింది. వర్షం సమయంలో నగరంలోని రహదారులు, డ్రైనేజీలు పొంగిపొర్లినా.. గంట వ్యవధిలోనే నీరు బయటకు వెళ్లిపోయింది. రూరల్ జిల్లాలతో పోలిస్తే నగరంలో వర్షపాతం తక్కువగానే నమోదైంది. హనుమకొండ జిల్లాలో సగటున 31.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పరకాలలో 52.1 మి.మీ, అత్యల్పంగా శాయంపేట మండలంలో 22.1 మి.మీ వర్షం కురిసింది. జనగామ జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. 

బొగతకు తాత్కాలికంగా నో ఎంట్రీ.. 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకుల భద్రత దృష్ట్యా అటవీశాఖ, పోలీసు అధికారులు బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం శివారులోని భీమునిపాదం జలపాతం వద్ద సందడి నెలకొంది. వర్షాలతో జలపాతం పరవళ్లు తొక్కుతుండటంతో వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికి తరలివెళ్లారు.