అస్సాం, మేఘాల‌యాలో వ‌ర‌ద‌ల ఉధృతి.. 31 మంది మృతి

అస్సాం, మేఘాల‌యాలో వ‌ర‌ద‌ల ఉధృతి.. 31 మంది మృతి

గౌహ‌తి : అస్సాం, మేఘాల‌యాలో భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌రద‌లు బీభ‌త్సం సృష్టించాయి. గ‌త రెండు రోజుల నుంచి వ‌ర‌ద‌ల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిపడుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది మ‌ర‌ణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 ల‌క్షల మంది వరద ప్రభావానికి గుర‌య్యారు. ల‌క్ష మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. అస్సాంలో 12 మంది మృతిచెంద‌గా, మేఘాల‌యాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

త్రిపుర రాజ‌ధాని అగ‌ర్తలాలో భారీ స్థాయిలో వ‌రద‌లు బీభత్సం సృష్టించాయి. సుమారు 6 గంట‌ల్లోనే 145 మిల్లీమీట‌ర్ల వ‌ర్షపాతం కురిసింది. దీంతో త్రిపుర ఉప ఎన్నిక ప్రచారంపై తీవ్ర ప్రభావం ప‌డింది. మేఘాల‌యాలోని చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వ‌ర్షం కురిసింది. అగ‌ర్తలాలో 60 ఏళ్ల త‌ర్వాత అత్యధిక వ‌ర్షం పాతం న‌మోదైంది. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల వ‌ల్ల స్కూళ్లను మూసివేశారు. వ‌ర‌ద‌ల్లో చ‌నిపోయిన బాధిత కుటుంబాల‌కు మేఘాల‌యా సీఎం రూ.4 ల‌క్షల న‌ష్టప‌రిహారాన్ని ప్రకటించారు. అస్సాం వ‌ర‌ద‌ల్లో మూడు వేల గ్రామాలు నీటమునిగాయి. 43 వేల హెక్టార్ల పంట నేలపాలైంది. పలుచోట్ల క‌ల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి.