తమిళనాడును వణికిస్తున్న వర్షాలు

తమిళనాడును వణికిస్తున్న వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తమిళనాడును వణికిస్తోంది. చెన్నైతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామేశ్వరం తడిసి ముద్దయింది. రోడ్లపై వాన నీరు ప్రవహిస్తోంది. ఇంకా వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో కోస్తా తీర జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2015 తర్వాత ఇప్పుడే అధిక వర్షపాతం నమోదైందన్నారు అధికారులు. అప్పట్లో అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ చివరి వరకు 160 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. అయితే ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 27 వరకు 119 సెంటీ మీటర్ల వర్ష పడింది. 

వర్షాలతో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా శివార్లలోని ఆలందూర్, పజవంతాంగల్, ఎయిర్ పోర్ట్, పల్లవరం, పెరంగళత్తూరు, క్రోంపేట ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. తాంబారంలో చాలా మంది వరద నీటిలో చిక్కుకుపోయారు.  ఇళ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. అధికారులు మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. 

మరోవైపు చెన్నైలో భారీ వర్షం కురిపిస్తోంది. శనివారం వరకు చెన్నైలో 119.9 సెం.మీ.వర్షపాతం రికార్డయ్యింది. నెల వ్యవధిలో చెన్నై సిటీలో వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైలో నగర చరిత్రలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవడం 200 ఏళ్ల చరిత్రలో ఇది నాలుగోసారి.  ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అండమాన్‌ తీరంలో రేపు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో..తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం రెడ్‌ అలర్ట్ జారీ చేసింది.