ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం

ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారు జాము నుంచి ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న గురుగ్రామ్, మనేసర్, ఫరీదాబాద్, బల్లబ్ గఢ్, లోనీ దెహాత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సహా NCR పరిధిలో... ఆగకుండా వాన కురుస్తోంది. ఊహించని భారీ వర్షంతో... అనేక చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అండర్ పాస్ లలోకి భారీగా నీరు చేరింది. ఢిల్లీలోని పూల్ ప్రహ్లాద్ పూర్, ఇండియా గేట్, మధు విహార్, మోతీ బాగ్, RK పురం, జోర్ బాగ్ ఏరియాల్లో భారీ వర్షంతో కాలనీలు, రోడ్లపైకి నీరు చేరింది. 

ఢిల్లీలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అలాగే వేగంగా గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఢిల్లీలో అతి భారీ వర్షాలు కురవడం 10 రోజుల గ్యాప్ లో ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో... భారీ వర్షాలకు ఢిల్లీ, NCRలు వణికిపోయాయి. మధ్యలో దాదాపు వారం గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి.


ఈసారి నైరుతి రుతు పవనాలు ఢిల్లీని ఆలస్యంగా పలకరించాయి. చాలా ఆలస్యంగా ఢిల్లీపై రుతు పవనాల ప్రభావం మొదలైంది. ఇంత లేట్ కావడం ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైమ్. అయితే వాటి ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన వర్షపాతం వెయ్యి మిల్లీ మీటర్లు దాటిపోయింది. ఆ తర్వాత ఈ స్థాయిలో వర్షం పడడం 11 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2010లో వర్షపాతం వెయ్యి మిల్లీ మీటర్ల మార్క్ దాటింది. ఈసారి ఇఫ్పటికే వెయ్యి ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఢిల్లీలో సాధారణ వర్షపాతం 648.9 మిల్లీమీటర్లు.  ఈ నెల 1న ఢిల్లీలో 112.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2న 117.7 మిల్లీమీటర్ల వాన పడింది. ఈ నెలలో ఇప్పటివరకు 248.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజానికి ఢిల్లీలో సెప్టెంబర్ యావరేజ్ 129.8 మిల్లీమీటర్ల కాగా... 2 రోజుల్లోనే దాదాపు రెట్టింపు వర్షం కురిసింది.