వానకు నీట మునిగిన రోడ్లు, కాలనీలు

వానకు నీట మునిగిన రోడ్లు, కాలనీలు

సిటీలో  సోమవారం సాయంత్రం కురిసిన వానకు పలు కాలనీలు నీట మునిగాయి.  ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్​లో వర్షం పడటంతో వాహనదారులు ట్రాఫిక్ జామ్​తో ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, కొంపల్లి, నిజాంపేట, బండ్లగూడ, ఉప్పల్, మల్కాజిగిరి, సరూర్​నగర్, సనత్​నగర్, అమీర్​పేట, పంజాగుట్ట, రాజేంద్రనగర్,  నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్​లో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది.

అత్తాపూర్​ నుంచి ఆరాంఘర్ వెళ్లే రూట్​లో పీవీ నర్సింహారావు ఎక్స్​ప్రెస్ వే పిల్లర్ నం.193 వద్ద వరద నీరు రోడ్లపై చేరడంతో దాదాపు 2 గంటల పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు.  అపురూప కాలనీలోని జనప్రియ అపార్ట్ మెంట్ వద్ద రోడ్డు చెరువును తలపించింది.  మరోవైపు ఆదివారం రాత్రి సిటీలో కురిసిన భారీ వానకు చాలా కాలనీల్లోని అపార్ట్​మెంట్ల సెల్లార్​లో నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల జనం ఇబ్బందులు పడ్డారు. మూడ్రోజులుగా దంచి కొడుతున్న వానలకు జవహర్​నగర్ డంపింగ్ యార్డులోని మురుగు కార్మికనగర్​లోని ఇండ్లలోకి చేరుతుండటంతో స్థానిక జనం సోమవారం ఉదయం కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి డంపింగ్ యార్డ్ ముందు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్/గండిపేట/జీడిమెట్ల/జవహర్​నగర్, వెలుగు