
తిరువనంతపురం/న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన సైక్లోన్ ‘తౌక్టే’ ప్రభావంతో కేరళలో శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. సముద్రం నుంచి తీర ప్రాంతానికి అలలు పోటెత్తుతున్నాయి. బలమైన గాలులు వీస్తుండటంతో చెట్లు విరిగిపడుతున్నాయి. చాలా చోట్ల ఇండ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తుపాను ధాటికి ఇద్దరు చనిపోయారని అధికారులు వెల్లడించారు. తౌక్టే సైక్లోన్ ఆదివారం నాటికి తీవ్ర పెను తుపాను (వెరీ సివియర్ సైక్లోన్)గా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. మంగళవారం గుజరాత్ లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. సైక్లోన్ వల్ల గుజరాత్ తో పాటు రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గోవాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
24 గంటలు కంట్రోల్ రూంలు: ప్రధాని మోడీ
సైక్లోన్ తౌక్టే విషయంలో అలర్ట్ గా ఉండాలని ప్రధాని మోడీ అధికారులను ఆదేశించారు. తుపాను తర్వాత సహాయక చర్యలకు సన్నద్ధతపై శనివారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో రివ్యూ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్, తాగునీరు, ఫుడ్ వంటి అత్యవసర సర్వీసులకు ఆటంకం కలగకుండా చూడాలని చెప్పారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు.