మహారాష్ట్రలో జోరు వానలు..కొట్టుపోయిన కార్లు

మహారాష్ట్రలో జోరు వానలు..కొట్టుపోయిన కార్లు

ముంబై/ఇండోర్: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కొల్హాపూర్, సంగ్లీ, సతారా, నాగపూర్ జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. కొల్హాపూర్ జిల్లాలోని పంచగంగ నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో కొల్హాపూర్ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. నాగపూర్ యూనివర్సిటీ పరిధిలోనూ బుధవారం జరగాల్సిన అన్ని ఎగ్జామ్స్ ను వాయిదా వేశారు. ముంబైలో మంగళవారం నుంచి మోస్తరు వర్షం పడుతోంది. సిటీలో 2.68 సెంటీమీటర్లు, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 3.13, 3.30 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గురువారం మహారాష్ట్ర సహా మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

ఇండోర్ లో 10 సెం.మీ వర్షపాతం.. 

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీలోనూ భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సిర్పూర్ చెరువు ఉప్పొంగింది. వరద ధాటికి కొన్ని కార్లు కొట్టుకుపోయాయి. బుధవారం అన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండ్రోజులూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ పంపించామని, అవసరమైతే అక్కడి వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని మేయర్ పుష్యమిత్ర భార్గవ చెప్పారు.