తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య గంటకు 90-110 కి.మీ వేగంతో మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి తీరం దాటింది. మోంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఆయా జిల్లాల్లోని విద్యా సంస్థలకు బుధవారం (అక్టోబర్ 29) సెలవు ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు బుధవారం (అక్టోబర్ 29) ఆయా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు హాలీ డే ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, తుఫాను ప్రభావంతో హైదరాబాద్‎తో పాటు పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. భారీ వర్షానికి చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 

భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి,. మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 41-61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో (గాలులు వీచే) మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.