గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. జునాగఢ్, రాజ్ కోట్, జామ్ నగర్ జిల్లాల్లో వరదలు పారుతున్నాయి. రాజ్ కోట్ జిల్లాలోని లోధికా అనే పట్టణంలో నిన్న 12గంటల వ్యవధిలో 20 ఇంచ్ ల వర్షం కురిసింది. జునాగఢ్ జిల్లాలోని విశ్వదార్ తాలుకాలో 12గంటల్లో 14 ఇంచ్ ల వర్షం కురిసింది. జునాగఢ్ లో రోడ్లపైనే వరద పారుతోంది. ఓ కార్ వరదల్లో కొట్టుకుపోయింది. దానిని స్థానిక అధికారులు బయటకు తీశారు. రాజ్ కోట్, జునాగఢ్, పోర్ బందర్, అమ్రేలీ జిల్లాల్లో 24శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం వర్షాకాలంలో కురవాల్సిన వానలో 15శాతం గత 7 రోజుల్లోనే కురిసింది. వరదల కారణంగా ముగ్గురు చనిపోయారు. ఐదుగురు గల్లంతయ్యారు. NDRF, SDRF టీమ్ లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరిన్ని సహాయక బృందాలు సహాయక చర్యల కోసం వస్తాయని అధికారులు తెలిపారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ లను కూడా రెడీగా ఉంచారు. అవసరమైతే నేవీ, ఎయిర్ ఫోర్స్ ల సాయం తీసుకుంటామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. నిన్ననే గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ వరదలపై సమీక్షించారు.
