రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
  • కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు మృతి 
  • మరో రెండ్రోజులు వర్షాలు: వాతావరణ శాఖ

నెట్ వర్క్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, నిర్మల్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. కొన్నిచోట్ల వాగులు ఉప్పొంగి రోడ్లు జలమయమయ్యాయి. కరీంనగర్ రూరల్, మానకొండూరు మండలాల్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ సిటీలో కురిసిన భారీ వర్షానికి ముకరంపుర, రాంనగర్, విద్యానగర్, జ్యోతినగర్, కట్టరాంపూర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డులో మూడు ఫీట్ల వరకు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్ఎండీ గేట్లను ఏ టైమ్ లోనైనా ఎత్తే అవకాశం ఉందని, కింది ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సిద్దిపేటలో దాదాపు మూడు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పాత బస్టాండ్, భారత్ నగర్, మెదక్ రోడ్డు, హైదరాబాద్ రోడ్లు నీట మునిగాయి. పాత బస్టాండ్ వద్ద రెండు ఫీట్ల మేర నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొంతమంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. దుబ్బాక పట్టణంలోనూ భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, సుజాతనగర్, ములకలపల్లి ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. కాగా, వర్షాలతో చాలాచోట్ల వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగింది. వానలోనే గణనాథులను నిమజ్జనానికి తరలించారు. 

వాగు ఆవల చిక్కుకున్న 30 మంది రైతులు..  
నారాయణపేట జిల్లా మక్తల్ లో భారీ వర్షాలకు గొల్లపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి మంథన్ గోడ్​వాగు వరద కూడా తోడవడంతో మంథన్ గోడ్, మక్తల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంథన్ గోడ్ పెద్దచెరువు అలుగు పారడంతో దత్తాత్రేయ స్వామి ఆలయం దగ్గర బ్రిడ్జిపైకి వరద వచ్చి సామాన్ పల్లి,  మంథన్ గోడ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో దుందుభి వాగు, దెయ్యాల వాగు, ఉడుముల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం, సోమారం తండా మధ్య బతుకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో 30 మంది రైతులు చిక్కుకుపోయారు.  

పిడుగులకు ఇద్దరు బలి.. 
భారీ వర్షాలకు పిడుగులు పడి ఇద్దరు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పెట్రాం చెలక స్టేజీ వద్ద పిడుగు పడి వసంతరావు (28) అనే రైతు చనిపోగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో పొలం దగ్గర పిడుగు పడి భాగ్య అనే మహిళ చనిపోయింది. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోతాయి పల్లిలో పిడుగు పడి రాములు అనే వ్యక్తికి చెందిన 20 మేకలు చనిపోయాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని యాదవుల పల్లెలో బర్రె, దూడ మృతి చెందాయి.