దేశ వ్యాప్తంగా వర్షాలు.. ప్రజల అవస్థలు

దేశ వ్యాప్తంగా వర్షాలు.. ప్రజల అవస్థలు

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. యూపీలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులన్ని  చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రాజస్తాన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సికార్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి అవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని హూబ్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. నడుం లోతు నీళ్లు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు. 

ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న పంట పొలాలు నేల మట్టమయ్యాయి. తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట మొత్తం మునిగిపోయి  నష్టపోయామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.