భానుడి భగభగలు.. వారం రోజుల పాటు నిప్పుల వర్షం..

 భానుడి భగభగలు.. వారం రోజుల పాటు  నిప్పుల వర్షం..

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.  పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి.  పగటి ఉష్ణోగ్రతలు 36  నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాల్లో  వేడిగాలులు వీస్తున్నాయి. బుధవారం  ( ఏప్రిల్​ 24) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తాయని  లక్నో వాతావరణ కేంద్రం తెలిపింది.  గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  ఉత్తరప్రదేశ్​ లో అన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.  ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. లక్నో వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం వారం రోజుల పాటు ( ఏప్రిల్​ 24 నుంచి) గరిష్ఠ ఉష్టోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.  చాలా ప్రాంతాల్లో  వేడి గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది..  రాత్రి ఉష్టోగ్రతలు కూడా 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని  లక్నో వాతావరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అతుల్ కుమార్ సింగ్ తెలిపారు..  గతేడాది కంటే ఈ ఏడాది వడగాలులు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. 

సుల్తాన్‌పూర్, అయోధ్య, ఫుర్సత్‌గంజ్, బారాబంకి, హర్దోయ్, కాన్పూర్, వారణాసి, బస్తీ, ఝాన్సీ, ఒరాయ్, హమీర్‌పూర్‌లలో  40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  రాత్రి ఉష్ణోగ్రత దాదాపు 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. తూర్పు యుపిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా హీట్​ వేవ్స్​  వచ్చే అవకాశం ఉందని లక్నో వాతావరణ శాఖ ప్రకటించింది.  . ఏప్రిల్ 24 , 25 తేదీలలో ఉత్తరప్రదేశ్​ లో చాలా జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. 

కొన్ని జిల్లాల్లో  ఎల్లో అలర్ట్

ప్రయాగ్‌రాజ్, సోన్‌భద్ర, మీర్జాపూర్, చందౌలీ, జౌన్‌పూర్, ఘాజీపూర్, సంత్ రవిదాస్ నగర్, వారణాసి, మౌ, బల్లియా, అజంగఢ్, డియోరియా, గోరఖ్‌పూర్, సంత్ కబీర్ నగర్, కుషీనగర్, మహరాజ్‌గంజ్, సిద్ధార్థ్ నగర్, బలరాంపూర్, శ్రావస్తి, అంబేద్కర్ రాష్ట్రం. చిత్రకూట్, బల్రాంపూర్, ఫతేపూర్, కౌశాంబి, రాయ్ బరేలీ, ఉన్నావ్, సుల్తాన్‌పూర్, అయోధ్య మరియు కాన్పూర్ పరిసర జిల్లాల్లో హీట్ వేవ్ కారణంగా వాతావరణ శాఖ  ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ఉత్తరప్రదేశ్​ లో  ఉష్ణోగ్రతలు పెరగడంతో యూపీ ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  ఈ ఏడాది ఎండలకు హీట్​ స్ట్రోక్​ వచ్చే అవకాశం ఉందని లక్నోలోని లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడిసిన్ విభాగం చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ప్రతి ఒక్కరు దాదాపు రోజుకు 10 నుంచి 12 గ్లాసుల వరకు నీటిని తీసుకోవాలని .....తేలికపాటి ఆహారం.. ద్రవపదార్దాలు ఎక్కువుగా తాగాలని సూచించారు.  కొబ్బరినీళ్లు.. సీజనల్​ ఫ్రూట్స్​.. పల్చటి మజ్జిగ  తాగాలన్నారు.

  • దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని చెప్తున్నారు. బయటకు వెళ్తే టోపి లేదా రుమాలు కట్టువాలంటున్నారు.  
  • దాహం వేయకపోయినా తరుచుగా నీటిని తాగాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగుతుండాలని తెలిపారు.
  • వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాకపోతే వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.  ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు లేదా నిమ్మరసం, కొబ్బరి నీరు తాగాలి. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తలతిరగడం, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరల్లోని వైద్యున్ని సంప్రదించాలి.   ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు.
  • ఉదయం11గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయకూడదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగొద్దు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కూల్‌ డ్రింక్స్‌ జోలికి వెళ్లకండి. అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే పదార్దాలకు దూరంగా ఉండండి.
  • ఎండల పట్ల ప్రజలు జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. అటు ఎండలతో తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..శీతల పానియాలను ఆశ్రయిస్తు్న్నారు. కొబ్బరిబొండాలు, చెరుకురసాలు, నిమ్మరసాలను ఎక్కువగా తాగుతున్నారు. దీంతో ప్రస్తుతం వీటికి మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది.