
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగా ముందుగానే నైరుతి రుతు పవనాలు కేరళను తాకాయి. ఎనిమిది రోజులు ముందుగానే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఈరోజు(శనివారం) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఐదు జిల్లాలకు అతి భారీ, ఐదు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మార్చి 27 నాటికి పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో 27 నుంచి మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.