తెలంగాణలో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు

తెలంగాణలో  నాలుగు రోజులు అతి భారీ వర్షాలు

 

  • రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం
  • ఆరెంజ్​ అలర్ట్​జారీ చేసిన వాతావరణశాఖ
  • ఆ తర్వాత తగ్గుముఖం పట్టనున్న వానలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. సోమవారానికి రెండు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను ఇచ్చింది. ఆదిలాబాద్​, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొన్నది. మిగతా మూడు రోజులకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్​, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్​ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది.హైదరాబాద్ ​సిటీలో 2 రోజులపాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడొచ్చని పేర్కొన్నది.


జిల్లాల్లో మస్తు వానలు..

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్​, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరు, మహబూబాబాద్​ జిల్లా మహబూబాబాద్​లో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్​లో 10.9 సెంటీమీటర్లు, మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో 10.6, ఖమ్మం జిల్లా తల్లాడలో 10.3, ఖమ్మం జిల్లా వైరాలో 9.1, వేంసూరులో 9.1, మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురులో 8.8, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో 8.4, మహబూబాబాద్​ జిల్లా గర్లలో 8.2, వికారాబాద్​ జిల్లా బొమ్రాస్​పేటలో 8.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 8, టేకులపల్లిలో 7.7, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తీవ్రవాయుగుండంగా బలపడి..

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్​పూర్​ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైంది. రాబోయే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడి ఒడిశా, పశ్చిమబెంగాల్​ తీరాల్లో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో అతి భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉందని తెలిపింది. అయితే, రెండు రోజుల తర్వాత ఈతీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చైనా, వియత్నాంలలో ప్రభావం చూపిస్తున్న యాగి తుఫాను ప్రభావంతో తీవ్రవాయుగుండం దూరంగా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.