ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 9న ‘హలో మాల.. చలో ఢిల్లీ’

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 9న ‘హలో మాల.. చలో ఢిల్లీ’
  • తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్

బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 9న ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద ఆందోళన తలపెట్టినట్లు తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ తెలిపారు. గురువారం లక్డీకాపూల్​ లోని అంబేద్కర్ హాల్లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చెరుకు రామచందర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ.. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే నెల 9న ‘హలో మాల.. చలో ఢిల్లీ’ నిర్వహిస్తున్నామని తెలిపారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అని రాజకీయ పార్టీలు గౌరవించాలని కోరారు. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్ కులాలను విభజించే హక్కు ఎవరికీ లేదన్నారు. వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు లేదని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి కేంద్రం స్పెషల్​బడ్జెట్  కేటాయించాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 22 శాతం వరకు పెంచాలని, ప్రైవేట్ రంగాల్లోనూ అమలు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మాలల భవనానికి 5 ఎకరాల భూమిని కేటాయించి రూ.20 కోట్లతో నిర్మించాలన్నారు. ట్యాంక్ బండ్ పై భాగ్యరెడ్డి వర్మ కాస్య విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. జేఏసీ చీఫ్ అడ్వైజర్ అంజయ్య, సలహాదారు కె.బాలకృష్ణ, వర్కింగ్ చైర్మన్ నర్సింహయ్య, కో చైర్మన్ గడ్డం సత్యనారాయణ, వైస్ చైర్మన్ దాసరి భాస్కర్, ఎస్.నగేశ్, ఎస్.నాను, గంగాధర్, సుధీర్, మన్నే రవి, అచ్చుతయ్య, రాజు, కాజా తదితరులు పాల్గొన్నారు.