
హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ పేషెంట్లు ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్ కు రాకుండా.. జిల్లాల్లోనే ట్రీట్‌మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి జిల్లాకో కీమో థెరపీ సెంటర్ పెట్టి అక్కడే కీమోథెరపీ, రేడియో థెరపీ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. టీ డయాగ్నస్టిక్ సెంటర్స్ ద్వారా క్యాన్సర్ డిటెక్షన్‌కు అవసరమైన పరీక్షలు చేయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే హాస్పిటల్‌లో అరబిందో ఫార్మా సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన కొత్త బ్లాక్‌ను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఈ బిల్డింగ్‌తో ఎంఎన్‌జేలో బెడ్ల సంఖ్య 750కి చేరిందన్నారు. ఈ బ్లాక్‌లో ప్రత్యేకంగా విమెన్, పీడియాట్రిక్ వింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చికిత్స కోసం వచ్చే చిన్నారుల చదువు దెబ్బతినకుండా పీడియాట్రిక్ వింగ్ లో లైబ్రరీ, టీచర్ ను ఏర్పాటు చేసి ట్రీట్‌మెంట్ తో పాటు విద్యను కూడా అందిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి క్యాన్సర్ పేషెంట్ల ట్రీట్‌మెంట్ కు ఆరోగ్యశ్రీ కింద రూ.800 కోట్లు ఖర్చు చేశామని, గత ఏడాది రూ.137 కోట్లు ఖర్చయ్యాయని మంత్రి తెలిపారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉచితంగా మందులు కూడా అందిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఎంఎన్‌జేలో బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ కు ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర జబ్బుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, డైరెక్టర్ రఘునాథన్, హెల్త్ సెక్రటరీ రిజ్వి, ఎంఎన్ జే డైరెక్టర్ డాక్టర్ జయలత పాల్గొన్నారు.