పెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం

పెద్ద మనసు చాటుకున్న బాలయ్య.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.50 లక్షలు విరాళం

తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన క్రమంలో.. సినీ అగ్రహీరోల నుంచి తొలిసారిగా బాలకృష్ణ స్పందించారు. సీఎం రిలీఫ్​ ఫండ్ కు 50 లక్షల రూపాయలు డొనేట్ చేసి మంచి మనసు చాటుకున్నారు. శనివారం (ఆగస్టు 30) హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్​ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. నష్టం దృష్ట్యా.. ఉడతఆ భక్తిగా రూ.50 లక్షలు డొనేట్ చేస్తున్నానని అన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సహకారం తననుంచి ఉంటుందని చెప్పారు. 

అంతకు ముందు సినీ పరిశ్రమ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మొదటగా ముందుకొచ్చారు. తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి  ముందుగా స్పందించిన సందీప్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. 
 

వర్షాలకు తెలంగాణలో భారీ నష్టం:

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జనజీవనం అస్తవ్యవస్థమయ్యింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి.ఊర్లకు ఊర్లు  మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది.రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

 భారీ వర్షాల కారణంగా  మొత్తం 28 జిల్లాల్లో 2 లక్షల 20 వేల443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని... రాష్ట్రవ్యాప్తంగా లక్షా 43 వేల 304  మంది రైతులు నష్టపోయారని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

 అత్యధికంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పంటల నష్టం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలోనే 77 వేల394  ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో 23 వేల169  ఎకరాలు, ఆదిలాబాద్‌లో 21 వేల276 ఎకరాలు, నిజామాబాద్‌లో 18 వేల 417 ఎకరాలు, కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో 15 వేల 317 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి.