
విశాల్ హీరోగా ‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విశాల్ మాట్లాడుతూ ‘19 ఏళ్ల నా కెరీర్‌లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను నా చిత్రాల్లో రియల్ స్టంట్స్ చేయడానికే ఇష్టపడతాను. మా డాక్టర్ వద్దన్నా ఎప్పుడూ వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి.
ఇందులోనూ అలాంటి యాక్షన్ సీన్స్‌లో నటించా. హరి గారితో భరణి, పూజ చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, డైలాగ్ రైటర్ రాజేష్ కారణంగా ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో నేను ఓటు వేశాను. అందరూ ఓటు వేయాలి.
కొత్త ఓటర్లు కచ్చితంగా వెళ్లి పోలింగ్‌లో పాల్గొనండి’ అని చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ ‘డైరెక్టర్ హరి మార్క్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. కచ్చితంగా విజయం సాధించి, సమ్మర్ సినిమాగా నిలుస్తుందని నమ్మకం ఉంది’ అని అన్నారు. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మురళీ శర్మ, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.