- అధికారులకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె, హైదరాబాద్ మేయర్గద్వాల విజయలక్ష్మికి చెందిన స్థలాల క్రమబద్ధీకరణపై సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. కేకే కొడుకు, కుమార్తె స్థలాలను క్రమబద్ధీకరిస్తూ 2023 మే 23న గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 56ను సవాల్‌చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జి.రఘువీర్ రెడ్డి 2023లో దాఖలు చేసిన పిల్ పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు అడ్వకేట్ వై.శ్రేయస్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బంజారాహిల్స్ స్లమ్ ఏరియాలో కేకే కుమారుడికి చెందిన 1,161 చదరపు గజాల స్థలాన్ని 1998 నాటి మార్కెట్ విలువ (చదరపు గజం రూ.2,500) ప్రకారం, కవితారావు జీపీఏ హోల్డర్‌గా విజయలక్ష్మికి చదరపు గజం రూ.350 చొప్పున 425 చదరపు గజాలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో 56 జారీ చేసిందన్నారు. కానీ, అప్పుడు ప్రభుత్వ మార్కెట్ ధర చదరపు గజం రూ.60 వేలకుపైగా ఉందన్నారు. 1998లో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి మార్కెట్ ధర ప్రకారమే క్రమబద్ధీకరించిందన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఇది ప్రత్యేకంగా జారీ చేసిన జీవో అని తెలిపారు.
ప్రతివాదులు అప్పటి ఆర్థికశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారని.. అప్పటికే ఒక ప్లాట్‌కు విద్యుత్ కనెక్షన్ ఉండడంతో మార్కెట్ ధరకే క్రమబద్ధీకరణ చేశారన్నారు. వాదనలను విన్న బెంచ్.. ప్రైవేటు వ్యక్తులను స్థలం నుంచి తొలగించాలని చెప్పడంలేదని, పాలసీ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నామంది. ఆక్రమణకు గురైన స్థలాన్ని క్రమబద్ధీకరణకు పాలసీని తీసుకువచ్చినట్లయితే అందరికీ ఒకేలా వర్తింపజేయాలంది. అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని, అలాకాకుండా గత నిర్ణయాన్ని సమర్థించుకోవాలని చూస్తే కోర్టు తరఫున తామే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

