- బీసీ సంక్షేమ సంఘం పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గింపు వ్యవహారానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లపై కోవా రెంటో పిటిషన్ దాఖలు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ గురువారం బీసీ సంక్షేమ సంఘం పిటిషన్‌ను కొట్టివేసింది. రిజర్వేషన్‌ల తగ్గింపుపై అభ్యంతరాలుంటే చట్టప్రకారం తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చని పిటిషనర్‌కు సూచించింది.
బీసీ రిజర్వేషన్లను తగ్గించడంపై ప్రభుత్వ కార్యదర్శులతోపాటు 31 మంది కలెక్టర్లపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కోవా రెంటో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ పి.శ్యాం కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక 24 నుంచి 17 శాతానికి తగ్గించారన్నది వెల్లడించలేదన్నారు.
రిజర్వేషన్లను తగ్గిస్తున్నట్లయితే ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రాత్రికి రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. రిజర్వేషన్‌లను కూడా ఏ ప్రాతిపదికన కేటాయించారన్న వివరాలను వెల్లడించలేదన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారన్నారు. రిజర్వేషన్ పాలసీ శాసన వ్యవస్థదని, కలెక్టర్లకు ఆ అధికారం లేదని, అందువల్ల తగిన ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోవా రెంటో పిటిషన్ వేయడానికి వారేమీ ఎన్నికైనవారు కాదని, పిటిషన్ విచారణార్హం కాదన్నారు.
వాదనలను విన్న ధర్మాసనం కలెక్టర్లందరినీ తొలగించాలంటూ ఎలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కలెక్టర్ పోస్టులకు సంబంధించి కోవా రెంటో పిటిషన్‌ను అనుమతించలేమంటూ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
