హైదరాబాద్, వెలుగు: ఆస్తుల విభజన దావాలో వాది చెల్లించిన కోర్టు ఫీజు సరైనదా లేదా అనేదానిని ట్రయిల్ లోనే తేల్చాలని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ నిజాం కుటుంబానికి చెందిన ప్రిన్స్ అజ్మత్ జా, మరో వ్యక్తి దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ పి. సామ్ కోశీ ఈనెల 18న కొట్టివేశారు. ఐదు ఆస్తుల విభజన, ప్రత్యేక స్వాధీనం కోరుతూ దాఖలైన ఈ దావాలో.. కింగ్ కోఠి/నజ్రీబాగ్ ఆస్తికి సంబంధించి 2018లో నమోదైన విక్రయ పత్రాన్ని చెల్లదని ప్రకటించాలని వాది కోరారు. కాగా, వాది సెక్షన్ 34(2) కింద స్థిర కోర్టు ఫీజు చెల్లించగా, ఆస్తులపై మొదటి ప్రతివాదికి ప్రత్యేక స్వాధీనం ఉన్నట్లు వాది తన పిటిషన్‌లోనే పేర్కొన్నందున.. సెక్షన్ 34(1) ప్రకారం వాటా మార్కెట్ విలువ ఆధారంగా ఫీజు చెల్లించాల్సి ఉందని పిటిషనర్లు వాదించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వాది సహ వాటాదారుడా, ఉమ్మడి స్వాధీనంలో ఉన్నారా, ఏ నిబంధన ప్రకారం కోర్టు ఫీజు చెల్లించాలనే అంశాలన్నీ పూర్తి స్థాయి వాదనలు, సాక్ష్యాల ఆధారంగా ట్రయల్‌లోనే నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 కింద ఇందులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
