ఎమ్మెల్యే దానంపై  అనర్హత వేటు.. స్పీకర్‌‌‌‌ తీర్పును కొట్టేసిన హైకోర్టు

ఎమ్మెల్యే దానంపై  అనర్హత వేటు.. స్పీకర్‌‌‌‌ తీర్పును కొట్టేసిన హైకోర్టు
  •  2024 ఏప్రిల్‌‌‌‌ 23 నుంచే అనర్హత
  •     ‘ఖైరతాబాద్‌‌‌‌’ ఖాళీ అయినట్టు వెల్లడి
  •     తీర్పు అమలుపై స్టేకు నిరాకరణ
  •     హైకోర్టు తీర్పును స్వాగతించిన దానం
  •     బై పోల్​ వస్తే పోటీకి సిద్ధమన్న నాగేందర్

 
హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్‌‌‌‌ వెలువరించిన తీర్పును కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌‌‌ 191(2), పదో షెడ్యూల్‌‌‌‌లోని 2(1)(ఎ) ప్రకారం.. దానం నాగేందర్‌‌‌‌ 2024 ఏప్రిల్‌‌‌‌ 23 నుంచే శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది.

అదే తేదీన దానం నాగేందర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ బీఫారం తీసుకుని సికింద్రాబాద్‌‌‌‌ పార్లమెంటు సీటుకు నామినేషన్‌‌‌‌ వేశారని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌‌‌‌ లోక్‌‌‌‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్‌‌‌‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించింది. స్పీకర్‌‌‌‌ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి తీర్పు ప్రతులను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జీఎం మొహియుద్దీన్ తో కూడిన డివిజన్ బెంచ్‌‌‌‌ శుక్రవారం తీర్పు వెలువరించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌‌ రెడ్డి, బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. 

మొదటి పార్టీని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ తరఫున ఖైరతాబాద్‌‌ నుంచి దానం నాగేందర్‌‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఏప్రిల్‌‌ 23న కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌‌ లోక్‌‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో రాజకీయ పార్టీ తరఫున పార్లమెంట్‌‌ ఎన్నికల్లో పోటీ చేయడం పదో షెడ్యూల్‌‌లోని 2(1)(ఎ) పరిధిలోకి వస్తుందని ధర్మాసనం తేల్చింది. పదో షెడ్యూల్‌‌ కింద ఎమ్మెల్యేపై అనర్హతను నిర్ణయించేటప్పుడు శాసనసభలో సభ్యుడి ప్రవర్తనకే పరిమితం కావాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా లేదా అన్నది నిర్ణయించేందుకు అసెంబ్లీ వెలుపల ఆయన చేపట్టిన రాజకీయ కార్యకలాపాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తేల్చింది. ఈ విషయంలో డాక్టర్‌‌ మహాచంద్ర ప్రసాద్‌‌ సింగ్‌‌ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న డివిజన్‌‌ బెంచ్.. ఒక పార్టీ తరఫున ఎన్నికై శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తి మరో పార్టీ టికెట్‌‌పై పార్లమెంట్‌‌ ఎన్నికల్లో పోటీ చేస్తే మొదటి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా పరిగణించవచ్చని పేర్కొంది. పదో షెడ్యూల్‌‌ కింద స్పీకర్‌‌ ట్రిబ్యునల్‌‌ చైర్మన్ గా వ్యవహరిస్తారని.. ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదని, న్యాయ సమీక్ష చేయవచ్చునని స్పష్టం చేసింది. పదో షెడ్యూల్‌‌ కింద స్పీకర్‌‌ ట్రిబ్యునల్‌‌గా వ్యవహరిస్తారని, అందువల్ల సభ్యుడి సభలోని ప్రవర్తనతోపాటు బయట జరిగిన సంబంధిత చర్యలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

సభ వెలుపల జరిగిన చర్యలను పరిగణనలోకి తీసుకోలేమన్న స్పీకర్‌‌ అభిప్రాయం చట్టపరంగా నిలబడదని తెలిపింది. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన, చట్టపరమైన తప్పిదం వంటి పరిమిత అంశాల్లో ఆర్టికల్‌‌ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. కాంగ్రెస్‌‌ బీ-ఫారం, నామినేషన్ పత్రాలు, ఎన్నికలకు సంబంధించిన అధికారిక రికార్డులను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్‌‌ తరఫున లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం అనర్హతకు దారితీసిన చర్యగా తేల్చింది. బీఆర్‌‌ఎస్‌‌ క్రమశిక్షణ 
చర్య తీసుకోకపోవడం లేదా అసెంబ్లీ రికార్డుల్లో అదే పార్టీ సభ్యుడిగా కొనసాగడం వల్ల తనపై అనర్హత వేటు వేయరాదన్న దానం వాదన ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏర్పడిన అనర్హత తొలగిపోదని స్పష్టం చేసింది. 1986 నాటి ఫిరాయింపుల నియమావళిలోని నిబంధనలను కారణంగా చూపి పిటిషన్లను తిరస్కరించలేమని చెప్పింది. రూల్‌‌ 6(6), 6(7)లోని నిబంధనలు ప్రక్రియాపరమైనవేనని.. వాటిని కఠినమైన తప్పనిసరి నిబంధనలుగా పరిగణించి అనర్హత పిటిషన్  ను కొట్టివేయడం పదో షెడ్యూల్‌‌ ఉద్దేశానికి విరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. అనర్హతకు దారితీసిన చర్య జరిగిన తేదీ నుంచే అనర్హత అమల్లోకి వస్తుందన్న సుప్రీంకోర్టు తీర్పుల్లోని సూత్రాన్ని అనుసరించి 2024 ఏప్రిల్‌‌ 23 నుంచే దానం నాగేందర్‌‌ అనర్హుడని తేల్చింది. పిటిషన్లు దాఖలై సుదీర్ఘకాలం గడిచినందున వ్యవహారాన్ని మళ్లీ స్పీకర్‌‌కు పంపకుండా తామే అనర్హతను నిర్ణయం తీసుకుంటూ తీర్పు చెప్పినట్టు వివరించింది. తీర్పు అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం ఇవ్వాలని, అప్పటివరకు తీర్పు అమలును నిలిపివేయాలని దానం నాగేందర్‌‌ తరఫు న్యాయవాది కోరగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దానం ఎమ్మెల్యేగా ఉన్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యే ఒక్క రోజు కూడా ఆ పదవిలో కొనసాగేందుకు వీల్లేదని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. తీర్పు అమలును నిలిపివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. 

91 పేజీల తీర్పు

ఈ వ్యవహారంలో స్పీకర్‌‌ వద్ద దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం లేదంటూ గతంలో హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్‌‌ జడ్జి ఆదేశాల అనంతరం వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా, స్పీకర్‌‌ వద్ద పెండింగ్‌‌లో ఉన్న అనర్హత పిటిషన్లను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సుప్రీంకోర్టు 2025 జులై 31న ఆదేశించింది. ఆ నేపథ్యంలో దానం నాగేందర్‌‌పై దాఖలైన పిటిషన్లను స్పీకర్‌‌ విచారించి తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్‌‌ చేస్తూ కౌశిక్‌‌రెడ్డి, మహేశ్వర్‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన అనంతరం డివిజన్ బెంచ్‌‌.. గత ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసి, శుక్రవారం 91 పేజీల తీర్పును వెలువరించింది.
 

సుప్రీంకు వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకోలే: దానం 

ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా తనపై హైకోర్టు ఇచ్చిన తీర్పును దానం నాగేందర్ స్వాగతించారు. తీర్పు వెలువడిన అనంతరం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ‘ఎన్నికలు నాకు కొత్త కాదు.. నేను ఫైటర్​ను..  మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా..’ అని ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే ప్రశ్నకు ఆయన సమాధానం 
దాటవేశారు.