పీసీఏలకు ఆఫీసులు, స్టాఫ్ ఏరి?

పీసీఏలకు ఆఫీసులు, స్టాఫ్ ఏరి?
  • రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: పోలీసులపై వచ్చే ఫిర్యాదుల్ని విచారించేందుకు స్టేట్‌‌ లెవెల్‌‌ పోలీసు కంప్లైంట్‌‌ అథారిటీ (పీసీఏ), జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్‌‌ అథారిటీలకు ఆఫీసులు, స్టాఫ్​ను ఏర్పాటు చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అవేవి లేకుండా ఫిర్యాదు మండలికి చైర్మన్, మెంబర్స్‌‌ను నియమిస్తే ఉపయోగం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. 2 నెలల్లోగా వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చర్యల రిపోర్టును ఆగస్టు 24న జరిగే తదుపరి విచారణలోగా అందజేయాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది.

సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్‌‌ సింగ్‌‌ వర్సెస్‌‌ కేంద్రం కేసులో జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌ మేరకు పీసీఏల ఏర్పాటు చేయలేదంటూ దాఖలైన కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని, సుమోటో కోర్టు ధిక్కరణ కింద జారీ చేసిన ఆదేశాలు కూడా అమలు కాలేదని ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌గా తీసుకొంది. ఇదే అంశంపై లాయర్‌‌ మామిడి ఎ.వేణుమాధవ్‌‌ వ్యక్తిగత హోదాలో మరో పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఈ రెండింటిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.