శ్రీధర్​ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

శ్రీధర్​ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్‌‌ పోలీసు స్టేషన్ లో నమోదైన ఫోర్జరీ అభియోగాల కేసు నిందితుడు లింగారెడ్డి శ్రీధర్ ను అరెస్ట్‌‌ చేయరాదని మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను జూన్‌‌ 11కి వాయిదా వేసింది. ఈ లోగా పోలీసులు కౌంటర్‌‌ దాఖలు చేయాలని జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ ఆదేశించారు. 

తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించేందుకు యత్నించారంటూ నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్ పై బంజారాహిల్స్‌‌ పోలీసులు కేసును నమోదు చేశారు. దీనిని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలాన్ని తన తండ్రి 1990లో కొనుగోలు చేశారని పిటిషనర్‌‌ వాదించారు. ఇదే కేసులో మరో నిందితుడైన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్‌‌ ఎవరో తనకు తెలియదని శ్రీధర్ చెప్పారు.