సమ్మెపై హైకోర్టులో విచారణ సాగిందిలా..

సమ్మెపై హైకోర్టులో విచారణ సాగిందిలా..

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ, కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ, సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సమ్మె విషయంపై కోర్టులో రాష్ట్ర సర్కారు, ఆర్టీసీ, కార్మికులకు మధ్య వాడీ వేడీ వాదనలు జరిగాయి. ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూల వైఖరిని కనపర్చిన కోర్టు అనేక సార్లు సర్కారు తీరుపై సీరియస్ అయింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ, పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేసింది.

హైకోర్టులో ఏ రోజు ఏం జరిగిందంటే..

అక్టోబర్‌‌‌‌ 6: ‘‘ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. మామూలుగా10 వేల బస్సులు నడిస్తే, ఇప్పుడు11వేల బస్సులు నడిపిస్తున్నం’’ అని కోర్టుకు సర్కార్‌‌‌‌ వివరించింది.

అక్టోబర్‌‌‌‌10: ‘‘బస్సులెక్కేందుకు ప్రయాణికులే వస్తలేరా..? రోడ్లపై మాకు ఆర్టీసీ బస్సులే కనిపించలేదు. సమ్మె ఏర్పాట్లపై ప్రభుత్వ నివేదిక సరిగా లేదు. పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అక్టోబర్‌‌‌‌15: ‘‘ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం, యూనియన్లు మొండిగా ఉన్నాయి. పట్టువిడుపులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ప్రభుత్వ ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉన్నయి. సమస్యలు వచ్చినప్పుడే ప్రభుత్వం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది. సమ్మె ప్రారంభించాక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి’’ అని సర్కార్‌‌‌‌కు కోర్టు సూచించింది.

అక్టోబర్‌‌‌‌16: ‘‘ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్‌‌‌‌ జీతాలు చెల్లించడంలో ఆలస్యమైంది. అక్టోబర్‌‌‌‌21 వరకు జీతాలు ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళతాం’’ అని ఆర్టీసీ తరఫు లాయర్‌‌‌‌ కోర్టుకు విన్నవించారు.

అక్టోబర్18: ‘‘అగ్గి మొదలైంది. అగ్గి రాజుకుని మంటలు ఎగిసిపడే వరకూ చేయకండి. ఇతర సంఘాలు కూడా స్వరం కలిపితే పరిస్థితి ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజాగళం విప్పితే ఎవరూ అడ్డుకోలేరు. ఫిలిప్పీన్స్‌‌‌‌లో పాలకుడికి ఎంతో ఆదరణ ఉండేది. కానీ ప్రజలు ఎదురు తిరిగేసరికి ఏం జరిగింది? అక్కడ పాలనకు తెర పడింది. ఎంత ప్రజా బలం ఉన్న నేత అయినా ప్రజల దగ్గరికి వచ్చే సరికి ఎంత హంబుల్‌‌‌‌ ఉంటే అంత మంచిది’’ అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

అక్టోబర్‌‌‌‌21: ‘‘ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇయ్యనీకె డబ్బులు లేవు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. జీతాలు ఇయ్యాలంటే నెలకు రూ.239 కోట్లు కావాలె. ఆర్టీసీ దగ్గర రూ.7.39 కోట్లు మాత్రమే ఉన్నాయి. సర్కార్‌‌‌‌ ఏటా డబ్బులిస్తేనే ఆర్టీసీ బతుకుతుంది. సమ్మె చట్ట విరుద్ధం అని ప్రకటించండి’’ అని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు లాయర్ విజ్ఞప్తి చేశారు. వాదనలను విని బెంచ్‌‌‌‌ నోట్‌‌‌‌ చేసుకుంది.

అక్టోబర్‌‌‌‌28: ‘‘మేం కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగినవాళ్లమే. బస్సులు లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటయో మాకూ తెలుసు. ఇప్పటికీ 40 శాతం కంటే మించి బస్సులు నడుస్తలేవు. మారుమూలన ఉన్న ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో గిరిజనుల గోడు చూడండి. అక్కడ రోగంతో బాధపడే పిల్లాడ్ని వరంగల్‌‌‌‌ ఆస్పత్రికి తీసుకపోవాలంటే మార్గం ఏదీ? పాలమూరు నుంచి ఓ డెంగీ రోగి హైదరాబాద్‌‌‌‌ ఎట్లొస్తడు. సొంతంగా అంబులెన్స్‌‌‌‌ల్లో రాలేరు కదా? సామాన్యుల బాధలను మానవీయం కోణంలో చూడాలి’’ అని సర్కారుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అక్టోబర్‌‌‌‌29: ‘‘సర్కార్‌‌‌‌ లెక్కలన్నీ అంకెలగారడీలా ఉన్నాయి. హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌కు వంద కోట్లు ఇచ్చారు. ఆర్టీసీకి ఇవ్వలేరా? అప్పులకు గ్యారెంటీ ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టేనా? సరైన వివరాలతో రండి’’ అని ఆర్టీసీ ఎండీ సునీల్‌‌‌‌ శర్మను కోర్టు ఆదేశించింది. ఇదేరోజు సకల జనుల సమర భేరీ సభకు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది.

నవంబర్‌‌‌‌1: ‘‘ఆర్టీసీపై తప్పుడు లెక్కలేంది? ఏం తమాషానా..? బకాయిలపై మంత్రికి ఒక లెక్క.. మాకో లెక్క చెప్తరా..? కోర్టులతో ఆటలాడొద్దు. పర్యవసానాలు ప్రభుత్వానికి తెలియవా..? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు..?’’ అని కోర్టు ఫైర్‌‌‌‌ అయ్యింది.

నవంబర్‌‌‌‌ 6: ‘‘ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాం. మాకే540 కోట్లు ఇయ్యాలె. గతంలో మిగులు బడ్జెట్‌‌‌‌ ఉంటే ఇచ్చినం’’ అని కోర్టుకు జీహెచ్‌‌‌‌ఎంసీ, ఆర్టీసీ కౌంటర్‌‌‌‌ దాఖలు చేశాయి. ఆర్టీసీ ఉద్యోగుల సొసైటీకి ఆరు వారాల్లోగా రూ.200 కోట్లు చెల్లించాలని ఆర్టీసీని కోర్టు ఆదేశించింది.

నవంబర్‌‌‌‌ 7: ‘‘రాష్ట్రానికి పాలకుడు తండ్రి అయితే, ప్రజలు పిల్లలు. ఆర్టీసీ విషయంలో పాలకుడు పెద్ద మనసు చేసుకోవాలె. ఆర్టీసీ అంటే 48 వేల మంది కార్మికులు మాత్రమే కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమస్య. దాని గురించి పట్టించుకోపోతే ఎట్ల..? కోర్టుకు తప్పుడు లెక్కలు చెబుతారా..? కోర్టు అంటే లెక్కలేదా.. సారీ చెబితే సరిపోతుందా.. సునీల్‌‌‌‌ శర్మను మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో..?’’ అని సర్కార్‌‌‌‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

నవంబర్‌‌‌‌ 8: ‘‘సమ్మె సమయంలో బస్సు రూట్లను ప్రైవేట్‌‌‌‌ చేయడంపై అటు కార్మికులు.. ఇటు ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. దీంతో తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. కేబినెట్‌‌‌‌ నిర్ణయాలు రహస్యం కాదు. కోర్టులు ఆదేశిస్తే ప్రభుత్వాలు తమ నిర్ణయాలు చెప్పాలి’’ అని ప్రైవేట్‌‌‌‌ రూట్లపై కేబినెట్‌‌‌‌ నిర్ణయంపై కోర్టు వ్యాఖ్యానించింది.

నవంబర్‌‌‌‌11: ‘‘ఆర్టీసీ పబ్లిక్‌‌‌‌ యుటిలిటీ సర్వీస్‌‌‌‌. దానికి ఎస్మా వర్తించదు. కార్మికులకూ హక్కులు ఉన్నాయని మర్చిపోవద్దు. ఇరు పక్షాలను చర్చలకు బలవంతం చేయలేం. ప్రైవేట్‌‌‌‌ రూట్లపై మేం చెప్పే దాకా స్టే కొనసాగుతుంది’’ అని కోర్టు స్పష్టం చేసింది.

నవంబర్‌‌‌‌12: ‘‘సమ్మెపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేస్తం. ఆ కమిటీ చెప్పే మాటలైనా సర్కార్‌‌‌‌ వింటదా.. లేదా..? స్పష్టంగా అభిప్రాయం చెప్పండి. హైకోర్టుకే గౌరవం ఇవ్వలేదు. లేబర్‌‌‌‌ కోర్టుకు ఏం ఇస్తరు?’’ అని సమ్మెపై కమిటీ ప్రతిపాదన సందర్భంగా కోర్టు కామెంట్ చేసింది.

నవంబర్‌‌‌‌13: ‘‘సుప్రీంకోర్టు రిటైర్డ్‌‌‌‌ జడ్జీల కమిటీకి ఒప్పుకునేది లేదు. సమ్మెపై తేల్చాల్సింది లేబర్‌‌‌‌ కోర్టే. దానికే రిఫర్‌‌‌‌ చేయండి. ఎస్మా కింద ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్‌‌‌‌గా ప్రకటించండి. టీఎస్‌‌‌‌ ఆర్టీసీకి కేంద్రం అనుమతి అవసరం లేదు’’ అని సర్కార్‌‌‌‌ కోర్టుకు తెలిపింది.

నవంబర్‌‌‌‌14: ‘‘కేబినెట్‌‌‌‌ డెసిషన్‌‌‌‌ గుట్టుగా ఉంచడం ఎందుకు? అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో నిర్ణయాన్ని పెడితే సమాచారం అందించినట్లు ఉంటుంది. పారదర్శకంగా ఉంటుంది. గుట్టుగా ఉండే కొద్దీ గందరగోళానికి తెరదీసినట్లే..’’ అని ప్రైవేట్ కు 5100 రూట్లు ఇవ్వడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కోర్టు కామెంట్ చేసింది.

నవంబర్‌‌‌‌16: ‘‘కార్మికులకు చర్చల హక్కు లేదు. స్వచ్ఛందంగా చేరతామన్నా తీసుకునే పరిస్థితి లేదు. సమ్మె చట్ట విరుద్ధం. స్ట్రైక్‌‌‌‌లో పాల్గొన్న వాళ్లంతా శిక్షార్హులే. విలీనం అంశం తాత్కాలికంగా పక్కన పెట్టినా మళ్లీ ముందుకు తెస్తరు. యానియన్లది బ్లాక్‌‌‌‌మెయిలింగ్‌‌‌‌. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పింది. సమ్మె చట్ట విరుద్ధం అని ప్రకటించండి’’ అని ఆర్టీసీ ఇన్‌‌‌‌చార్జి ఎండీ సునీల్‌‌‌‌ శర్మ కోర్టులో అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేశారు.

నవంబర్18: సమ్మె చట్టబద్ధమా? కాదా? అన్నది తేల్చే అంశాన్ని లేబర్​కోర్టుకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.