
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సర్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ నిర్మాణాలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ సిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా కేబీఆర్ సమీపంలోని చౌరస్తాల అభివృద్ధికి 2015లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని పర్యావరణవేత్త కె.పురుషోత్తమ్ రెడ్డి ఇతరులు 2016లో సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
కేబీఆర్ పార్కులో వన్యప్రాణులు, అరుదైన పక్షిజాతులు ఉన్నాయని, ఫ్లైఓవర్ నిర్మాణాలు జరిగితే వాటికి తీరని నష్టం వాటిల్లుతుందని, మూడు వేలకుపైగా చెట్లను నరికివేయాల్సి వస్తుందందని పిటిషనర్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. కౌంటరు దాఖలు చేశామన్నారు. కేంద్రం ఇంకా కౌంటరు దాఖలు చేయాల్సి ఉందన్నారు. దీంతో ఆరు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.