భూ ఆక్రమణ కేసులో ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు

భూ ఆక్రమణ కేసులో ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు
  • కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేల పిటిషన్‌‌‌‌పై హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లోని ప్రతివాదులైన ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సోమవారం హైకోర్టు ఆదేశిచింది. రెండు వారాల్లో నోటీసులు అందజేసి ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించింది. శేరిలింగంపల్లిలో సర్వే నెం.27లో 27.18 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు, అందులో బహుళ అంతస్తుల టవర్లను నిర్మిస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్‌‌‌‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, డాక్టర్‌‌‌‌ మురళీనాయక్‌‌‌‌ భూక్యా, కూచికుళ్ల రాజేశ్‌‌‌‌రెడ్డిలు హైకోర్టులో పిల్‌‌‌‌ దాఖలు చేసిన విషయం విదితమే. 

 దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ సుజయ్‌‌‌‌పాల్, జస్టిస్‌‌‌‌ యారా రేణుకలతో కూడిన బెంచ్‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది ప్రభాకర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. 1955-–58 కాస్రా పహాణిలో (పాత సర్వే నెం.117/3/1) సర్వే నెం.27లోని 27.18 ఎకరాల భూమి ప్రభుత్వ పోరంబోకుగా పేర్కొన్నారన్నారు. రంగారెడ్డి కలెక్టర్‌‌‌‌ ఎన్వోసీ ఇవ్వడంతో జీహెచ్‌‌‌‌ఎంసీ నిర్మాణాలకు అనుమతి మంజూరు చేసిందన్నారు. ఈ వ్యవహారంపై గత ఆదేశాల మేరకు గత నెల 24, 26 తేదీల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్టు తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదుల్లో ప్రైవేటు వ్యక్తులు సికిందర్‌‌‌‌ఖాన్, సలాబత్‌‌‌‌ఖాన్, పల్లవి, బేవర్లీ హిల్స్‌‌‌‌ ఓనర్స్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ సొసైటీ, బండి బిందులకు రెండు వారాల్లో నోటీసులు అందజేసి ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.