
హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్‌లో మే 26న రంగయ్య అనే వ్యక్తి లాకప్ డెత్ గురించి హైకోర్టు దృష్టికి తెచ్చిన లాయర్ పీవీ నాగమణి, ఆమె భర్త గట్టు వామనరావుల జోలికి పోలీసులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. లాకప్ డెత్ కేసును తాము విచారించినంత కాలం వాళ్లను ఏ కారణంగానూ పోలీస్ స్టేషన్ కు పిలవరాదని స్పష్టం చేసింది. గురువారం ఈమేరకు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. లాకప్ డెత్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇచ్చిన రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. దీనిపై స్పందించిన న్యాయవాది.. కౌంటర్ దాఖలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పిటిషనర్, ఆమె భర్త, వారి పిల్లలను పోలీసులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వామనరావుపై రెండు తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. మంథని సీఐ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు. పోలీసులు బెదిరింపులు, హెచ్చరికలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.