
హైదరాబాద్, వెలుగు: సైబరాబాద్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌కు, హెచ్‌ఎండీఏకు మధ్య వివాదం పరిష్కారంలో భాగంగా ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. హెచ్‌ఎండీఏకు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. కొల్లూరు నుంచి పటాన్‌చెరు వరకు 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే రూపకల్పన, నిర్మాణం, నిర్వహణకు సైబరాబాద్ ఎక్స్‌ప్రెస్ వేతో ఒప్పందం కుదిరింది. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) ప్రాతిపదికన కుదిరిన ఈ ఒప్పందంలో వివాదం మొదలైంది. వివాదం పరిష్కారం నిమిత్తం ఇరు పక్షాలు ఆర్బిట్రేషన్‌కు వెళ్లాయి.
ఇరు పక్షాల వాదనలను విన్న ఆర్బిట్రేటర్.. రూ.140.89 కోట్లతో పాటు రూ.39.50 కోట్లను వడ్డీతో ఎక్స్‌ప్రెస్ వేకు చెల్లించాలని హెచ్‌ఎండీఏకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అవార్డును సవాలు చేస్తూ హెచ్‌ఎండీఏ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేట్టింది. అర్బిట్రేషన్ అవార్డును అమలు చేయకపోవడం వల్ల ప్రతివాది అయిన సైబర్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ నష్టపోయిందని, అందువల్ల రూ.5 లక్షల జరిమానాను చెల్లించాంటూ హెచ్‌ఎండీఏను ఆదేశించింది.