- తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
- తుది తీర్పునకు అనుగుణంగా టెండర్లు ఉండాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ షాపుల దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగింపుపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఇరుపక్షాలు సోమవారంలోగా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే దరఖాస్తుల గడువు పెంపు, షాపుల డ్రా నిర్వహణపై స్టే ఇవ్వాలన్న పిటిషినర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
దీంతో ఈ నెల 27న మద్యం షాపుల డ్రా కు లైన్ క్లియర్అయింది. మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 18 నుంచి 23 వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన డి.వెంకటేశ్వరరావు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.తుకారాంజీ శనివారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ గడువు పొడిగించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయసమీక్ష పరిమితమని, దురుద్దేశం, పక్షపాతం ఉంటేనే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ తాము నిబంధనలు మార్చమని కోరడం లేదని, ఉన్న నిబంధనలను అమలు చేయాలనే కోరుతున్నామన్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారమే వెళ్లాలని, ఇందులో దరఖాస్తుల స్వీకరణకు గడువు నిర్దేశించిన తరువాత దాన్ని మార్చే అధికారం లేదన్నారు.
