భూదాన్‌‌‌‌ భూముల అన్యాక్రంతంపై కమిషన్‌‌‌‌ వేస్తరా, వెయ్యరా?

భూదాన్‌‌‌‌ భూముల అన్యాక్రంతంపై కమిషన్‌‌‌‌ వేస్తరా, వెయ్యరా?
  • ఏదో ఒక విషయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు 

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌‌‌‌ భూములను కొందరు కాజేశారనే ఆరోపణలపై విచారణ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేసే యోచన ప్రభుత్వానికి ఉందో లేదో.. చెప్పాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్రమ లావాదేవీల అభియోగాలపై కమిషన్‌‌‌‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన లేకపోతే అదే విషయం తమకు చెప్పాలని జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెం.194, 195లో ప్రభుత్వానికి చెందిన 10.17 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేరుతో అధికారులు మార్చేశారని అదే గ్రామానికి చెందిన వి.రాములు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. కొంతమంది సాయంతో అధికారులు పిటిషనర్‌‌‌‌ భూములను థర్డ్‌‌‌‌ పార్టీలకు కేటాయించారని న్యాయవాది విజయలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత మధ్యవర్తుల అండతో ఆ భూమికి సబ్‌‌‌‌ డివిజన్లను కేటాయించాక ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ అధికారులు కొనుగోలు చేశారన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జూన్‌‌‌‌ 28న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ అధికారులు వారి కుటుంబసభ్యులు తమ భూములను చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేశారని చెప్పారు. 
ప్రతివాదులుగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లు..

ఈ కేసులో ప్రతివాదులుగా ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, వారి కుటుంబసభ్యులు ఉన్నారు. ఐఏఎస్‌‌‌‌ అధికారులు నవీన్‌‌‌‌ మిట్టల్, వసుంధర సిన్హా, ఏకే మహంతి, ఐఏఎస్‌‌‌‌ అధికారులు అమోయ్‌‌‌‌ కుమార్, రాజశ్రీ హర్ష, అజయ్‌‌‌‌ జైన్, ఐపీఎస్‌‌‌‌ అధికారులు మహేశ్‌‌‌‌ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్త, తరుణ్‌‌‌‌ జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్‌‌‌‌ హెగ్దే ఉన్నారు. జ్ఞానముద్ర (రిటైర్డ్‌‌‌‌ సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ భార్య), పావని రావు (రిటైర్డ్‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌ రావు భార్య), ఐశ్వర్య రాజు (ఐఏఎస్‌‌‌‌ వికాస్‌‌‌‌ రాజు భార్య), రిటైర్డ్‌‌‌‌ డీజీపీ అనురాగ్‌‌‌‌ శర్మ, ఓం అనిరుధ్‌‌‌‌ (రాచకొండ కమిషనర్‌‌‌‌ కొడుకు), నందిన్‌‌‌‌ మాన్‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌ విక్రమ్‌‌‌‌ సింగ్‌‌‌‌ మాన్‌‌‌‌ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్‌‌‌‌ సందీప్‌‌‌‌ సుల్తానియా భార్య), రాధిక (ఐపీఎస్‌‌‌‌ కమలాసన్‌‌‌‌రెడ్డి భార్య), నితేశ్‌‌‌‌ రెడ్డి(రిటైర్డ్‌‌‌‌ డీజీపీ మహేందర్‌‌‌‌రెడ్డి కొడుకు), దివ్యశ్రీ (ఐఏఎస్‌‌‌‌ ఆంజనేయులు భార్య), రేణుగోయల్‌‌‌‌ (డీజీపీ జితేందర్‌‌‌‌ భార్య), రేఖా షరాఫ్‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌ ఉమేశ్‌‌‌‌ షరాఫ్‌‌‌‌ భార్య), హేమలత (ఇంటెలిజెన్స్‌‌‌‌ డీజీ శివధర్‌‌‌‌ రెడ్డి భార్య), ఇందూ రావు కావటి (ఐపీఎస్‌‌‌‌ లక్ష్మీనారాయణ భార్య), సవ్యసాచి ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌ గోవింద్‌‌‌‌ సింగ్‌‌‌‌ కొడుకు), రాహుల్‌‌‌‌ (రిటైర్డు ఐఏఎస్‌‌‌‌ జనార్దన్‌‌‌‌ రెడ్డి కొడుకు), వరుణ్‌‌‌‌ (ఐపీఎస్‌‌‌‌ విశ్వప్రసాద్‌‌‌‌ కొడుకు) ఉన్నారు.