తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్లో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో రెండు కుటుంబాలు క్యూలైన్లోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి.
దీంతో తోటి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గమనించిన శ్రీవారి సేవకులు వెంటనే టీటీడీ విజిలెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ అధికారులు భక్తులకు సర్ధిచెప్పారు.
అనంతరం ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీశారు. మిగిలిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు.
