టెహ్రాన్: ఇజ్రాయెల్–అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే కూడా మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే సోమవారం (మార్చి 2) మరణించినట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్–అమెరికా అటాక్స్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలుకూడా మరణించిన విషయం తెలిసిందే. ఖమేనీ, మన్సౌరే ఖోజాస్తేకు 1964లో వివాహం జరిగింది. వీరికి మొత్తం ఆరుగురు పిల్లలు. ఇందులో నలుగురు కుమారులు (మోస్తఫా, మోజ్తాబా, మసౌద్,మేసం) కాగా ఇద్దరు కుమార్తెలు (హోడా, బోష్రా). అమెరికా, ఇజ్రాయెల్ స్ట్రైక్స్ లో ఖమేనీ దంపతులు రోజుల వ్యవధిలోనే చనిపోయారు.
అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. శనివారం (ఫిబ్రవరి 28) తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే టెహ్రాన్లోని తన కార్యాలయంలో 86 ఏళ్ల ఖమేనీ చనిపోయారు. ఖమేనీ మరణ వార్తను ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు వ్యక్తులలో ఒకరు మరణించారని, ఇరాన్ ప్రజలు దేశాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఐఆస్ఐబీ' కూడా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. "ఇరాన్ సుప్రీం లీడర్ అమరత్వం పొందారు" అని ఆదివారం ఉదయం ప్రకటించింది.
పక్కాగా ట్రాక్ చేసి అటాక్..
ఇరాన్ నుండి దశాబ్దాలుగా పొంచి ఉన్న ముప్పును అంతం చేయడానికి, ఆ దేశం అణు ఆయుధాన్ని తయారు చేయకుం డా అడ్డుకోవడానికి ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ చెప్పారు. నిఘా, ట్రాకింగ్ వ్యవస్థ ల ద్వారా ఖమేనీ కదలికలను నిరంతరం పర్యవేక్షించామని, ఆయన తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండాపోయిం దని స్పష్టం చేశారు. "పశ్చిమాసియాలో శాంతి నెలకొనే వరకు ఈ ఖచ్చిత త్వంతో కూడిన బాధ్యతాయుత దాడులు కొనసాగుతాయి" అని ట్రంప్ హెచ్చరించారు.
కాగా, ఖమేనీ నివాస సముదాయంపై జరిగిన దాడిలో ఆయన మరణించారని, మృతదేహాన్ని కూడా వెలికితీశారని సీనియర్ ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఖమేనీ మృతదేహానికి సంబంధించిన ఫోటోను చూపించినట్లు 'చానల్ 12' వెల్లడించింది.
