- వార్డుల విభజనపై మల్లన్నసాగర్ ముంపు గ్రామస్తుల పిటిషన్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామస్తులను గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం చెల్లదని, ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై స్టే ఇవ్వాలన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. వార్డుల పునర్విభజన చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓ 7ను సవాలు చేస్తూ ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన వి.నరసింహారెడ్డి తదితరులు వేసిన పిటిషన్లను జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారించారు.
మల్లనసాగర్‌లో ముంపు గ్రామాలైన ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, బంజర్‌పల్లి, వేములఘాట్, నాగారం తాండాకు చెందిన ముంపు గ్రామస్తులకు పునరావాసం కింద గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో కలపడం చెల్లదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ.. మల్లన్నసాగర్‌లో ముంపు గ్రామాలను ఇతర గ్రామాల్లో పునరావాసం కింద విలీనం చేసినందున వాళ్లు ఆ గ్రామాల పరిధిలోకి వస్తారన్నారు. వాదనల తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెలువరించేందుకు నిరాకరించింది.
