V6 News

హైడ్రా విధివిధానాలు సమర్పించేదాకా  కూల్చివేతలు ఆపాలి 

హైడ్రా విధివిధానాలు సమర్పించేదాకా  కూల్చివేతలు ఆపాలి 
  • నీటివనరులు, పార్కులు, రోడ్లకు మినహాయింపు
  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 
  • ఐలాపూర్​లో కూల్చివేతలపై లంచ్​ మోషన్​ పిటిషన్ ​విచారణ

హైదరాబాద్, వెలుగు: హైడ్రాకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను సమర్పించే దాకా ఏ ప్రాంతంలో అయినా ఎలాంటి అనధికార నిర్మాణాలను కూల్చివేయడానికి వీల్లేదంటూ హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే చెరువులు, నీటివనరులు, నాలాలు, పార్కులు, ప్రజారహదారుల పునరుద్ధరణ కార్యక్రమాలకు మినహాయింపు ఉందని తేల్చి చెప్పింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా బృందం కూల్చివేతలను చేపట్టడాన్ని సవాలు చేస్తూ అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ఎం.ఎ.షరీఫ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో యూనిఫారంలో భద్రతా సిబ్బంది, ఇతర హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్లనాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, కాంపౌండ్, కూల్చివేస్తూ యుద్ధ సంఘటనను తలపించారన్నారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వుల పేరుతో సర్వే నెం.165 నుంచి 175, 212, 213లోని 36.37 ఎకరాలకు ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు వెయ్యికిపైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి ఎలాంటి అనుమతులు లేవని, విద్యుత్తు కనెక్షన్‌ అనుమతి కూడా లేదన్నారు. ఇక్కడ ఉన్న ఏ నిర్మాణానికి అనుమతులు లేవన్నారు.

వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేగాకుండా పిటిషనర్లు సమర్పించిన వీడియోను పరిశీలించి హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల చట్టం లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టు ముందుంచితే తప్ప ఎలాంటి అంతర్గత రహదారులు, ప్రహరీ గోడల తొలగింపు వంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా పిటిషనర్‌కు చెందిన పెద్ద భవంతిని కూల్చివేయడంపై న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుతో సహా ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై మార్గదర్శకాలను అమలు చేయాలని పేర్కొన్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపడుతోందన్నారు.

ఒకవేళ పిటిషనర్‌ది అక్రమ నిర్మాణమని భావించినప్పటికీ అధికారులు ఇంతకాలం కళ్లు మూసుకున్నారా అంటూ ప్రశ్నించారు. నిర్మాణాన్ని ప్రారంభంలోనే ఎందుకు అడ్డుకోలేదన్నారు. ప్రారంభంలో అడ్డుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి వందల కొద్దీ పిటిషన్‌లు దాఖలవుతున్నాయని, అందులో ఏ ఒక్క కేసులోనూ చట్టప్రకారం నిర్దేశించిన ప్రామాణిక విధానాన్ని అనుసరించినట్లు లేదని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 374బి కింద హైడ్రాకు అధికారం అప్పగించిందని, అంతేగాకుండా స్థానిక అధికారుల అధీనంలో ఉన్న భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందన్నారు. అయితే హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానంలేదని, అందువల్ల దీనికి సంబంధిచిన విధివిధానాలు సమర్పించేదాకా నీటివనరులు, నాలాలు, రోడ్లు తదితరాల రక్షణ చర్యలు తప్ప ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టరాదని ఆదేశించారు. ఐలాపూర్‌ భూములకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.