- పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తేల్చి చెప్పిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లు కేటాయించారన్న అభ్యంతరాలున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యంపై స్పష్టమైన నిషేధం ఉందని, ప్రస్తుతం ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతోపాటు మొదటి, రెండో విడతల ఎన్నికల నామినేషన్‌లు కూడా పూర్తయ్యాయని, ఈ దశలో ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది.
ఎస్టీ జనాభా లేకపోయినా వారికి రిజర్వు చేయడంతో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అలాంటి పంచాయతీలకు ప్రస్తుత ఎన్నికలు ముగిశాక ప్రభుత్వంతో చర్చించి తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం హామీని నమోదు చేస్తూ పిటిషన్‌లపై విచారణను మూసివేసింది.
నల్గొండ జిల్లా అనుముల మండలం శివాలయం పేరూరు గ్రామం, వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి పంచాయతీల్లో ఎస్టీ ఓటరు ఒక్కరూ లేకపోయినా సర్పంచ్‌తోపాటు మరికొన్ని వార్డు మెంబరు స్థానాలను కేటాయించడంతోపాటు మరికొన్ని పంచాయతీల్లో తగిన జనాభా లేకపోయినా రిజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
