రాయదుర్గంలోని భూమిపై హైకోర్టు తీర్పు

రాయదుర్గంలోని భూమిపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం 46లోని 84.30 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చింది. రాములు మరో 13 మంది కొన్న ఈ భూమి వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నది. సర్వే నం.46లో వలీలుల్లా హుస్సేన్‌‌‌‌‌‌‌‌కు ఆర్డీవో పట్టాలను జారీ చేశారు. దీనిని జాయింట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రద్దు చేశారు. ఆ చర్యను రెవెన్యూ బోర్డు వ్యతిరేకించింది. మళ్లీ విచారణ చేసి తగిన నిర్ణయం తీసుకోవాలంది. ఫలితంగా 1968లో విచారణకు రెవెన్యూ శాఖ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. అది ప్రభుత్వ భూమేనని తేలింది.

దీనిపై వలీలుల్లా హుస్సేన్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ బోర్డులో సవాల్‌‌‌‌‌‌‌‌ చేయగా,  జాయింట్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులను బోర్డు సమర్థించింది. కింది కోర్టు కూడా బోర్డు ఉత్తర్వులను ఆమోదించింది. దీనిపై వలీలుల్లా హుస్సేన్‌‌‌‌‌‌‌‌తోపాటు అతని నుంచి భూమి  కొనుగోలు చేసిన రాములు మరో 13 మంది హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ వివాదంపై హైకోర్టు మరోసారి విచారణ చేసి తగిన ఉత్తర్వలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం పైవిధంగా తీర్పు చెప్పారు.