హై రిస్క్‌‌తోనే హై రివార్డ్‌‌ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌‌‌‌

హై రిస్క్‌‌తోనే హై రివార్డ్‌‌ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌‌‌‌

ముంబై: హై-రిస్క్- హై -రివార్డ్ విధానాన్ని అనుసరించి టీ20 మ్యాచ్‌‌ల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి  తమ జట్టు సిద్ధంగా ఉందని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌‌లో క్రమం తప్పకుండా 250–-260 రన్స్ సాధించడమే తమ లక్ష్యమని చెప్పాడు. ‘ఈ ఆటలో మేము ఓడిపోతామని భయపడకూడదని అనుకుంటున్నాం. 

మేం హై-రిస్క్, హై -రివార్డ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. మా టీమ్‌‌లోని ప్లేయర్లు దీన్ని బాగా ఒంట బట్టించుకున్నారు. మేం క్రమం తప్పకుండా 250-–260 రన్స్ చేయాలని భావిస్తున్నాం. అలా చేసే ప్రయత్నంలో  మా జట్టు కొన్నిసార్లు  120–-130 స్కోర్లకే ఆలౌటయ్యే అవకాశం కూడా ఉంటుంది. టీ20 క్రికెట్ అంటే ఇదే. మనం అలాంటి హై-రిస్క్ క్రికెట్ ఆడకపోతే పెద్ద టోర్నీల్లో విజయాలు లభించవు. 

మా టీమ్  సరైన మార్గంలోనే ఉందని నేను అనుకుంటున్నా. మెగా టోర్నీల్లోనూ ఇలాంటి నిర్భయమైన ఆటను కొనసాగించాలి. ఏదైనా కోల్పోతామని అస్సలు భయపడకూడదు. మా టీ20 టీమ్ సిద్ధాంతం నిస్వార్థం, నిర్భయం అనే రెండు విషయాలపైనే  ఆధారపడి ఉందని  భావిస్తున్నా. గత ఆరు నెలల్లో మా కుర్రాళ్లు ప్రతీ రోజూ దీన్ని అనుసరించారు‘ అని ఇంగ్లండ్‌తో ఐదో టీ20 తర్వాత  గౌతీ చెప్పుకొచ్చాడు. ఈ పోరులో మెరుపు సెంచరీ సాధించిన అభిషేక్ శర్మను గౌతమ్ అభినందించాడు. అభి లాంటి ప్లేయర్ల విషయంలో కాస్త ఓపికగా ఉండాలని అభిప్రాయపడ్డాడు.