తెలంగాణ ఏర్పడ్డాక హయ్యెస్ట్ లిక్కర్ సేల్స్

తెలంగాణ ఏర్పడ్డాక హయ్యెస్ట్ లిక్కర్ సేల్స్
  • కరోనా టైంలోనూ బాటిల్​ దించలే
  • 2020-21లో రూ.26,938 కోట్ల సేల్స్
  • ఒక్క డిసెంబర్‌లోనే రోజుకు 100 కోట్ల మద్యం తాగిన్రు
  • ఆరున్నరేండ్లలో రూ.1.23 లక్షల కోట్ల మద్యం అమ్మకాలు
  • ఏటేటా పెరుగుతున్న సేల్స్.. సర్కారుకు మస్తు ఆదాయం

హైదరాబాద్‌‌, వెలుగు: గతేడాది కరోనా ఎంటరయ్యాక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పేద, మధ్య తరగతి వాళ్లకు పూట గడవడమే కష్టంగా మారింది. కానీ ఆబ్కారీ శాఖకు ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈ కరోనా ఇయర్​లోనే ఆల్ టైమ్ రికార్డ్ ఆమ్దానీ వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.26,938 కోట్ల విలువైన లిక్కర్‌‌ అమ్ముడైంది. మొత్తంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. కరోనా ఉన్నా మద్యం అమ్మకాలపై ఎఫెక్ట్‌‌ పడలేదు. ఈ ఏడాది ఐఎంఎల్‌‌ సేల్స్‌‌ బాగానే ఉండగా, బీర్‌‌ అమ్మకాలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి.

తాగుడే తాగుడు..
రాష్ట్రంలో 2,216 మద్యం షాపులు, 1,052 బార్లు, క్లబ్‌‌లు, పబ్‌‌లు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆల్‌‌టైం రికార్డు లిక్కర్‌‌ సేల్స్‌‌ జరిగాయి.  ఇక 2018–19లో రూ.20,859 కోట్ల విలువైన మందు తాగారు. 2019–20లో రూ.22,605 కోట్ల లిక్కర్‌‌ సేల్‌‌ అవ్వగా.. ఈ ఏడాది రూ.26,938 కోట్ల మద్యం అమ్ముడైంది. తెలంగాణ వచ్చిన 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.10,883.75 కోట్ల లిక్కర్‌‌ అమ్మారు. అంటే ఆరున్నరేండ్లలో 250 శాతానికి పైగా లిక్కర్‌‌ సేల్‌‌ వాల్యూ పెరిగింది. ఇలా ఏటా పెరుగుతూనే ఉంది.

లాక్​డౌన్​లో బంద్ కాకుంటే రూ.30 వేల కోట్లు
కరోనాతో గతేడాది మార్చి 22 నుంచి మే 4వ తేదీ దాకా వైన్స్‌‌ బంద్‌‌ చేశారు. ఈ నెలన్నర కూడా వైన్స్ తెరిచి ఉంటే సేల్స్ రూ. 30 వేల కోట్లకు చేరేవని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సంలోనే మరో ఆల్‌‌టైం రికార్డు కూడా నమోదైంది. ఒకే నెలలో ఎక్కువ మొత్తం సేల్స్‌‌ కొనసాగించిన నెలగా డిసెంబర్‌‌ నిలిచింది. ఆ నెలలో రూ. 2,764 కోట్ల విలువైన లిక్కర్ డిపోల నుంచి సరఫరా అయ్యింది. ఈ లెక్కన రోజూ సుమారు రూ.100 కోట్ల దాకా లిక్కర్‌‌ అమ్మకాలు జరిగాయి. సాధారణంగా రోజుకు రూ. 80 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వరకు సేల్స్ జరుగుతాయి. కాగా గతేడాది మే నెలలో లిక్కర్‌‌ రేట్లు 20 శాతం పెరిగాయి.

సగానికి పడిపోయిన బీర్ల సేల్స్
కరోనా నేపథ్యంలో చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు. చల్లని ప్రదేశంలో వైరస్‌‌ ఎక్కువ సేపు బతికే అవకాశం ఉందని చెబుతూ వస్తున్నారు. దీంతో దాని ఎఫెక్ట్‌‌ బీర్ల అమ్మకాలపై పడింది. రాష్ట్రంలో బీర్ల సేల్స్‌‌ సగానికి పడిపోయాయి. 2019–20 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌లో మే 5 నుంచి మార్చి 30 వరకు 4.32 కోట్ల కేసుల బీర్లు అమ్ముడవగా, 2020–21లో మాత్రం 2.67 కోట్ల కేసుల బీర్లు మాత్రమే తాగారు. ఐఎంఎల్‌‌ సేల్స్‌‌ మాత్రం కాస్త పెరిగాయి. గతేడాది 3.16 కోట్ల కేసుల ఐఎంఎల్‌‌ తాగగా, ఈ ఏడాది 3.29 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి.