
- మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు
- ఏటా నమోదవుతున్న యాక్సిడెంట్లలో 75శాతం ఆ టైంలోనే
- ఇండ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడే కారణాలు
- 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు.. 7,660 మంది మృతి
- రోజూ 40 బైక్ ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటలు.. రాష్ట్రంలో ప్రతి రోజు ఈ ఆరు గంటల్లోనే రహదారులు ఎక్కువగా రక్తమోడుతున్నాయి. ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదాల్లో 75 శాతం ఈ టైంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇందులో 58.6 శాతం ప్రమాదాలు ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డైవింగ్ కారణంగా జరుగుతుండగా.. మిగతా ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ సహా వివిధ రకాల ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా జరుగుతున్నాయి. ఈ మేరకు 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తాజాగా తన నివేదికలో వెల్లడించింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. 2023లో రాష్ట్రంలో 22,903 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. అందులో 7,660 మంది మృతి చెందారు. ఆ ఆరు గంటల వ్యవధిలో 8,775 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అలాగే, నిత్యం 40 బైక్ యాక్సిడెంట్లు జరుగుతూ.. 11 మంది మృతి చెందుతున్నట్టు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో బైక్ యాక్సిడెంట్లే ఎక్కువ..
హైదరాబాద్ తో పాటు స్టేట్, నేషనల్ హైవేస్‌పై జరుగుతున్న ప్రమాదాల్లో బైక్ యాక్సిటెంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. బైక్ ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం హెల్మెట్లేకపోవడమేనని నివేదిక పేర్కొంది. అందులోనూ యువతే ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడించింది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం మత్తు, హెల్మెట్‌ధరించకపోవడంతో 68 శాతం యువత రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నట్టు స్పష్టం చేసింది. 2023లో జరిగిన 14,385 బైక్ యాక్సిడెంట్లలో మొత్తం 3,844 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు 40 బైక్ యాక్సిడెంట్లు జరుగుతుండగా.. 11 మంది మృతి చెందుతున్నట్టు ఎస్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్‌తో పాటు సిటీ రోడ్లపై ఫుట్‌పాత్‌లకు రెయిలింగ్, ప్రీకాస్ట్ సిమెంట్ బ్లాక్స్, సైన్‌బోర్డులు, స్టాపేజ్ సిగ్నళ్లు, సైడ్ రెయిలింగ్స్ సరిగా లేని ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు పేర్కొంది.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఇవే..
రోడ్ సేఫ్టీపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వాహనదారుల తీరులో మార్పురావడం లేదు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్‌తో వారు ప్రమాదాలబారిన పడుతూ.. ఎదుటి వారి ప్రాణాలను రిస్క్‌లో పడేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని స్టేట్‌హైవేస్‌తో పాటు జాతీయ రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయాన్ని ట్రాఫిక్ పోలీసులు పీక్ అవర్స్‌గా పిలుస్తుంటారు. ఇందుకు కారణం ఆయా సమయాల్లో ఉద్యోగులు, వ్యాపారులు సహా సాధారణ ప్రజలు తమతమ పనులను ముగించుకుని ఇండ్లకు తిరిగి వెళ్తుంటారు. ఈ క్రమంలో రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఎక్కువగా మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో చీకటిపడడం, సాధారణం కన్నా ట్రాఫిక్ పెరగడం, అలసట, మద్యం మత్తు, ఇంటికి చేరాలనే ఆతృతలో అతి వేగం వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యల్పంగా ప్రమాదాలు నమోదయ్యాయని స్పష్టం చేసింది.